Thursday, March 22, 2012

ఉపఎన్నికల గుణపాఠాలు


ఉప ఎన్నికల ఫలితాలు మరోసారి రాజకీయ పార్టీలకు గుణపాఠాలు చెప్పాయి. నేర్చుకోవాలే కానీ అన్ని  పార్టీలకూ పాఠాలు ఉన్నాయి. స్పష్టంగా, నిర్ద్వంద్వంగా తెలంగాణవాదాన్ని వినిపించిన పార్టీలకే తెలంగాణలోని ఆరు నియోజకవర్గాలలో ప్రజలు పట్టం కట్టారు. నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రసన్నకుమార్ రెడ్డిని గెలిపించి ఆ పార్టీకి భవిష్యత్తులో ఇతర పార్టీలకు గట్టి పోటీ ఇవ్వనున్నదనే సంకేతాన్నిపంపించారు.
ఎన్నికలలో గెలుపొందడానికి కేవలం వనరులూ, తెలివితేటలూ, వ్యూహరచనా సామర్థ్యం కలిగిన నాయకులూ, హంగులూ, ఆర్భాటాలూ, అపారమైన నిధులూ ఉన్నంత మాత్రాన సరిపోదు. స్పష్టమైన విధానం కావాలి. ఆ విధానానిని ప్రజామోదం ఉండాలి. ఇంతవరకూ తెలంగాణవాదం పట్ల కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అనుసరించిన విధానం సరైనది కాదని ప్రజలు మరో సారి నిరూపించారు. ఇంకా ప్రజలను ఏమార్చడం, మాయ చేయడం సాధ్యం కాదని రెండు ప్రధాన పార్టీలూ గుర్తించాలి. తెలంగాణ సమస్యపైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయాన్ని నిర్భయంగా ప్రకటించాలి. ఆ నిర్ణయానికి ప్రజామోదం ప్రోదిచేయడానికి అవసరమైతే ప్రచారోద్యమం సాగించాలి. అంతే కానీ లోపల ఒక మాట పైకి మరో మాట అన్న చందంగా బూటకపు రాజకీయం చేయడం వల్ల రాష్ట్రానికే కాదు తమ పార్టీలకూ తీరని నష్టం జరుగుతుందని అధినాయకులు గుర్తించాలి.
ఉప ఎన్నికల ఫలితాలలో ఏ పార్టీకి ఎటువంటి గుణపాఠం ఉన్నది? ముందుగా తెలంగాణ రాష్ట్ర సమితి నేర్చుకోవలసిన పాఠం అందరిని కలుపుకొని పోవాలని. ఆ పార్టీ అధినేత చంద్రశేఖరరావు ఏకపక్షంగా నిర్ణయించి మహబూబ్ నగర్ నియోజవర్గంలో ఒక ముస్లిం అభ్యర్థిని నిలబెట్టారు. రాజకీయ జేఏసీలో భాగస్వామి అయిన భారతీయ జనతా పార్టీతో ముందుగా సంప్రతించి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో భాజపా కూడా పోటీకి దిగాలని నిర్ణయించుకుంది. లోగడ తెరాస మహబూబ్ నగర్ జిల్లా శాఖ అధ్యక్షుడుగా పని చేసిన ఎన్నం శ్రీనివాసరెడ్డిని అభ్యర్థిగా ఎంచుకుంది. ముస్లిం అభ్యర్థికి వ్యతిరేకంగా హిందూ ఓట్లను సమీకరించే విద్య యథావిధిగా ప్రదర్శించింది. రాజకీయ జేఏసీ సైతం అటు భాజపానూ, ఇటు తెరాసనూ బలపరచకుండా ఆత్మప్రబోధం ప్రకారం ఓటు చేయవలసిందిగా ప్రజలకు పిలుపునిచ్చింది. ఉద్యోగ సంఘాల నాయకుడు శ్రీనివాసగౌడ్ తెరాస అభ్యర్థిత్వం ఆశించి భంగపడటంలో ఉద్యోగులు సైతం భాజపా అభ్యర్థి విజయానికి కృషి చేశారు.  మొత్తం మీద చివరిదాకా ఉత్కఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో భాజపా అభ్యర్థి గట్టెక్కారు. దక్షిణ తెలంగాణలో భాజపా పాదం మోపడానికి అవకాశం కలిగింది. తెరాస అధ్యక్షుడి ఆంతర్యం ఏమిటో ఊహించడం కష్టం కాదు. భాజపాతో భుజం కలపడం ఆయనకు ఇష్టం లేదు. భాజపాకు దూరంగా ఉంటున్నట్టు కాంగ్రెస్ అధిష్ఠానానికి సంకేతం పంపడం, ముస్లింలకు తెరాస ప్రాముఖ్యంగా ఇస్తుందని తెలియజేయడం కేసీఆర్ నిర్ణయం లక్ష్యం కావచ్చు. మొత్తం మీద 2014లో జరగబోయే ఏన్నికలలో తెలంగాణవాదం వినిపించే అన్ని పార్టీలనూ, వ్యక్తులనూ కలుపుకొని పోవలసిందేననీ, లేకపోతే ఓటమి అనివార్యతమనీ, అది తెలంగాణవాదానికి నష్టదాయకమనీ ఈ ఉప ఎన్నికలు తెరాసను హెచ్చరించాయి.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చాలా శ్రమకోర్చి ఉపఎన్నికలలో ప్రచారం చేశారు. తెలంగాణ ప్రజలు చంద్రబాబునాయుడిని ఇంకా పూర్తిగా విశ్వసించడం లేదని భావించడానికి ఉప ఎన్నికల ఫలితాలు నిదర్శనం. తెలుగు దేశం పార్టీ అధినేత వినిపించిన తెలంగాణవాదానికి ప్రజలు సమ్మతించలేదు. రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ప్రజలు ఆమోదించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తాము సిద్ధమేనంటూ 2009 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రకటించడానికి  పూర్వం దక్షిణ తెలంగాణలో తెలంగాణవాదం అంత బలంగా లేదు. అప్పుడు కనుక తెలుగుదేశం పార్టీ అవకాశవాద రాజకీయానికి ఒడిగట్టకుండా సమైక్యవాదాన్ని వినిపించి ఉన్నట్లయితే రాష్ట్రంలో రాజకీయం బహుశా మరో విధంగా ఉండేది. అటువంటి సూత్రబద్ధమైన విధానాన్ని అవలంబించడానికి అవసరమైన తెగువ, నైతిక స్థాయి ప్రధాన ప్రతిపక్షంలో కొరవడటంతో  రాష్ర ప్రజలు అందుకు మూల్యం చెల్లిస్తున్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ ఏదో ఒక స్పష్టమైన, అసందిగ్ధమైన నిర్ణయం తీసుకొని ప్రజల ముందుకు వెడితే ప్రయోజనం ఉంటుంది. ఇంతకంటే నష్టం అయితే జరగదు. ద్వంద్వ వైఖరికి స్వస్తి చెప్పి నిర్దుష్టమైన విధానాన్ని ప్రకటించి, ఆచరించడం ద్వారా తెలుగు ప్రజలకు చంద్రబాబునాయుడు గొప్ప మేలు చేసినవారు అవుతారు. రాష్ట్రాన్ని రెండుగా విభజించినా ఫర్వాలేదని నిర్ణయించినా సరే లేదా రాష్ట్రం సమైక్యం ఉండాలని నిర్ణయించినా సరే, ఏ నిర్ణయమైనా మనస్ఫూర్తిగా తీసుకొని నిజాయితీగా దాని అమలు కోసం కృషి చేస్తే రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని తిరిగి ఆదరిస్తారు. ప్రత్యర్థి ఎత్తులకు తగినట్టు పైఎత్తులు వేయాలన్న జిత్తులమారి రాజకీయాన్ని ప్రజలు అంగీకరించడం లేదనీ, అసహ్యించుకుంటున్నారనీ గ్రహిస్తే ఎంతో శుభం జరుగుతుంది. తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం అభివృద్ధికి దోహదం చేసిన నాయకుడిగా చంద్రబాబునాయుడిపైన ఈ నైతిక బాధ్యత ఉన్నది. ఈ కర్తవ్యాన్ని ఉప ఎన్నికల ఫలితాలు మరోసారి గుర్తు చేస్తున్నాయి.
ఇక కాంగ్రెస్ నాయకులకు కూడా ఉప ఎన్నికల ఫలితాలలో గొప్ప గుణపాఠం ఉంది. రాష్ట్రస్థాయిలో నాయకులకు నిర్ణయాధికారం లేదని వారే చెబుతున్నారు. అది సాకుగా పెట్టుకొని దొంగాట ఆడుతున్నారు. అన్ని ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నాయకులూ ఈ వంచన శిల్పంలో ఆరితేరారు. ఫలితంగా రాజకీయ నాయకులన్నా, రాజకీయాలన్నా సామాన్య ప్రజలకు ఏవగింపు కలుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు ఢిల్లీలో అధిష్ఠాన దేవత తీసుకుంటారు కనుక ఆమె ప్రధమ్యాలు ఏమిటో అర్థం చేసుకుంటే ఆ పార్టీ విధానం ఎట్లా ఉండబోతున్నదో ఊహించవచ్చు. ‍ఉత్తర ప్రదేశ్ లో రాహుల్ గాంధీ నిర్వాకం తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధిష్ఠానవర్గానికి చాలా ముఖ్యమైన రాష్ట్రం అవుతుంది. ఉపఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే తెలంగాణలోనూ, సీమాంధ్రలోనూ మున్ముందు కాంగ్రెస్  పార్టీకి ప్రజలు చుక్కలు చూపిస్తారని అంచనా వేయవచ్చు. రెండు ప్రాంతాలలో భ్రష్టు పట్టడం కంటే కనీసం ఒక ప్రాంతాన్ని అయినా కాపాడుకోవడానికి ప్రయత్నించాలని కాంగ్రెస్ నాయకత్వం సహజ ఆత్మరక్షణ ధోరణిలో భాగంగా భావిస్తుంది. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సయోధ్య కుదుర్చుకోవడం కుదరదు. ప్రజలు మెచ్చరు. ఒక వైపు జగన్ ఆస్తులమీద, ఆప్తుల మీద సీబీఐ దాడులు నిర్వహిస్తూ మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం రాజీ చర్చలు జరపడం కుదరని పని. సీమాంధ్రలో మూడు పార్టీల మధ్య పోరు అనివార్యం. 2014లో చిరంజీవి, కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్, చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం, జగన్మొహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహురీ అనివార్యం. అది మహత్తర ఎన్నికల సంగ్రామం కాబోతోంది. దాని ఫలితం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో రాజీ పడాలో లేదో నిర్ణయించే అవకాశం కాంగ్రెస్ అధిష్ఠానవర్గానికి ఉంది. అదంతా జాతీయ స్థాయిలో ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత నెలకొనే పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది. తెలంగాణలో పట్టు సాధించాలని కాంగ్రెస్ భావించినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం, కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర సమితిని విలీనం చేసుకోవడం, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం, భాజపాలతో తలబడటం కాంగ్రెస్ వ్యూహం అవుతుంది. అట్లా కాకుండా రాష్ట్రాన్ని విభజించడం తెలుగువారికి నష్టదాయకమనీ, తెలుగువారి ప్రయోజనాలకోసం స్వీయప్రయోజనాలను త్యాగం చేయాలనే మహత్తరమైన, ఉదాత్తమైన ఆలోచన సోనియాగాంధీ చేస్తే ఆ సంగతి ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. ప్రజలలో సమైక్యభావనను పెంపొందించడానికి సత్వరం చర్యలు చేపట్టాలి. ఇంతవరకూ సాగించిన మార్మిక విధానానికి స్వస్తి చెప్పాలి. ఉప ఎన్నికలు ప్రసాదించిన ఈ గుణపాఠాలను నేర్చుకోవడానికి నిరాకరించే పార్టీలకూ, రాజకీయ నాయకులకూ నిష్కృతి ఉండదని వేరే చెప్పనక్కరలేదు.