Sunday, January 2, 2011

తెలివిడి కాదు.. తెగింపు కావాలి

దేశాన్ని పాలించే వారికి కేవలం తెలివితేటలు ఉంటే సరిపోదు. మనసుండాలి. ప్రజలకు మేలు చేయాలన్న తపన ఉండాలి. క్లిష్టమైన సమయాలలో తెగించి నిర్ణయాలు తీసుకొనే ధైర్యం ఉండాలి. నిర్ణయాల ఫలితాలను ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలి. పరిపాలకులు నిర్ణయాలు తీసుకోవడానికి భయపడకూడదు. కొన్ని నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తాయి. మరికొన్ని దుష్ఫలితాలు ఇవ్వవచ్చు. అయినా సరే, ఏదో ఒక నిర్ణయం తీసుకొని తీరాలి. ఏ నిర్ణయమూ తీసుకోని పాలకులకు అధికారంలో ఉండే అర్హత లేదు. నిష్క్రియాపరత్వానికి మించిన ప్రమాదం మరొకటి లేదు. సమస్త జనులందరూ ఆమోదించే నిర్ణయాలంటూ ఎక్కడా, ఏ వ్యవస్థలోనూ ఉండవు. సకాలంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే సమస్యలు జటిలమై సంక్షోభాలకు దారి తీస్తాయి. గతంలో దారి తీశాయి. వర్తమానంలో తీస్తున్నాయి.

పరిపాలన జ్యూతక్రీడ కాదు. ఒక పాచిక తర్వాత మరో పాచిక ప్రయోగించడం కాదు. దేశీయాంగ మంత్రి చిదంబరం తాజా పాచిక పారలేదు. ఆయన నాలుగు రోజుల కిందట ప్రయోగించిన పాచిక పాతదే. పాచిపోయినదే. సంవత్సరం క్రితం ఉపయోగించిందే. అంతకంటే భిన్నంగా, వినూత్నంగా, విశాలంగా ఆలోచించే సృజన కానీ, సాహసం కానీ హోమంత్రికీ, ప్రధానమంత్రికీ, వారిని నడిపిస్తున్న అధిష్ఠాన దేవతకీ లేకపోవడం అనర్థ హేతువు. ఈ వ్యాఖ్య తెలంగాణ సమస్యకి మాత్రమే పరిమితం కాదు. యూపీఏ ప్రభుత్వం కొన్నేళ్ళుగా అనేక సమస్యలపై ప్రదర్శిస్తున్న సాచివేత ధోరణికీ, అశక్తతకీ వర్తిస్తుంది. రెండేళ్ళ కిందటే నాటి టెలికాం శాఖ మంత్రి రాజాను అడ్డగోలుగా గడ్డితినకుండా అరికడితే ఈ రోజున ప్రధాని మన్మోహన్ సింగ్ అవమానభారంతో తలవంచుకోవలసిన దుస్థితి దాపురించేది కాదు. ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీకి ఇంత ఊపు వచ్చేది కాదు. మంత్రిమండలి నుంచి రాజాని తొలగించాలనే నిర్ణయం సకాలంలో తీసుకోకపోవడం వల్ల ఎంత నష్టం కలిగిందో అందరికీ తెలుసు. సురేష్ కల్మాడీ నేపథ్యం తెలిసి కూడా ఆయనపైన నిఘా పెట్టాలన్న నిర్ణయం తీసుకోకపోవడం వల్ల కామన్ వెల్త్ గేమ్స్ లో ఎంత అవినీతి జరిగిందో, దేశానికి ఎంత అపకీర్తి వచ్చిందో చెప్పనక్కరలేదు. జమ్మూ-కశ్మీర్ లో అయిదు మాసాలపాటు విద్యార్థులు బడులు వదిలి వీధులలోకి వచ్చి రాళ్ళు రువ్వడాలూ, భద్రతాదళాలు కాల్పులు జరపడాలూ జరిగిన మీదట అక్కడికి పార్లమెంటు సభ్యల కమిటీని పంపించడం మంచి నిర్ణయమే. ఆ కమిటీ తిరిగి వచ్చిన తర్వాత దాని కొనసాగింపుగా అంతకంటే ఉన్నత స్థాయి కమిటీని కానీ బృందాన్ని కానీ పంపితే సమంజసంగా ఉండేది. అట్లా చేయకుండా ఒక జర్నలిస్టునూ, ఒక అధ్యాపకురాలినీ, ఒక అధికారినీ పంపించడం, జమ్మూ-కశ్మీర్ లో తీరికగా పర్యటించి నివేదిక సమర్పించేందుకు వారికి ఒక సంవత్సరం వ్యవధి ఇవ్వడం క్షమార్హం కాని తప్పుడు నిర్ణయం.

తెలంగాణ విషయంలో సైతం ఒక అడుగు ముందుకు వేయడం, రెండు అడుగులు వెనక్కు వేయడం చందంగానే ఉంది దేశీయాంగ మంత్రి తీరు. నిరుడు జనవరి 5వ తేదీన రాష్ట్రం నుంచి ఎనిమిది గుర్తింపు కలిగిన పార్టీల నుంచి ఇద్దరేసి ప్రతినిధులను పిలిపంచడం వల్ల కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తెలంగాణవాదాన్నీ, సమైక్యవాదాన్నీ వినిపించాయి. దరిమిలా శ్రీకృష్ణ కమిటీని నియమించి, సంవత్సరంపాటు కాలక్షేపం చేశారు. కమిటీ నివేదిక అందిన తర్వాత తిరిగి ఎనిమిది పార్టీల నుంచి ఇద్దరేసి ప్రతినిధులను ఢిల్లీకి ఆహ్వానించారు. ఇందువల్ల ప్రయోజనం ఏమిటో దేశీయాంగ మంత్రికే తెలియాలి. ఇంకా దాగుడు మూతలు ఆడాలని అనుకోవడం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మరికొంత కాలం మౌనం పాటించాలనుకోవడం, రాష్ట్ర ప్రజలను గందరగోళంలో ఉంచాలనుకోవడం వ్యూహం అనిపించుకోదు. చేతగానితనం అనిపించుకుంటుంది. పిరికితనం అనిపించుకుంటుంది. దూరదృష్టి లేమి అనిపించుకుంటుంది. అవివేకం అనిపించుకుంటుంది. బాధ్యతారాహిత్యం అనిపించుకుంటుంది. దౌర్బల్యం అనిపించుకుంటుంది. బంతిని ప్రత్యర్థి కోర్టులోకి లాఘవంగా తన్నినందుకు చిదంబరం తనను తాను అభినందించుకుంటున్నారేమో తెలియదు. కానీ అఖిలపక్ష సమావేశాన్ని మరోసారి నిర్వహించాలన్న నిర్ణయాన్ని ఆలోచనాపరులు ఎవ్వరూ స్వాగతించడం లేదు. తెలంగాణవాదులు మాత్రమే కాదు, సమైక్యవాదులు సైతం ఈ విషయంలో సంతోషంగా లేరు. తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలు అఖిలపక్ష సమావేశానికి హాజరు కారాదని నిర్ణయించుకోవడంలో వింత లేదు. తెలుగుదేశం పార్టీ సైతం ఇదే నిర్ణయం తీసుకుంటుందనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ కు చెందిన తెలంగాణ పార్లమెంటు సభ్యులు కూడా అఖిలపక్షం అక్కరలేదంటున్నారు. ఎవరితో నిర్వహిస్తారు అఖిలపక్ష సమావేశం? పీఆర్ పీ, సీపీఐ నాయకులతోనా?

ఇప్పుడు జరగవలసింది ఒక్కటే. శ్రీకృష్ణ కమిటీ నివేదికను విడుదల చేయాలి. ఆఖరికి ఈ సమస్యకు కావలసింది రాజకీయ పరిష్కారం కనుక సోనియాగాంధీ రంగప్రవేశం చేయాలి. కేంద్ర ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవచ్చు. కాదంటే రాష్ట్రంలోని అన్ని పార్టీల అధ్యక్షులతో పాటు, జాతీయ పార్టీల జాతీయ స్థాయి అధ్యక్షులను కూడా ఆహ్వానించి ఒక సమావేశం నిర్వహించాలి. సమస్యను అన్నికోణాల నుంచీ కూలంకషంగా చర్చించి బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకోవాలి. సమావేశం ఒకరోజు జరగవచ్చు. వారంరోజులు జరగవచ్చు. ఇబ్బంది లేదు. నిజాయితీగా, నిస్సంకోచంగా అన్ని విషయాలూ చర్చించి ఏకాభిప్రాయానికి రావాలి. అవసరమైతే అన్ని పక్షాలూ కొన్ని త్యాగాలు చేయాలి. రాజీపడాలి. సర్దుబాటు చేసుకోవాలి. ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటికి అన్ని పార్టీలూ విధిగా కట్టుబడి ఉండాలి. ప్రజలకు వివరించి, వారిని ఒప్పించే బాధ్యత కూడా అన్ని రాజకీయ పార్టీలూ తీసుకోవాలి. శాశ్వత పరిష్కారం సాధించాలి. రాష్ట్రాన్ని కొంతకాలంగా పట్టిపీడిస్తున్న అనిశ్చితి తొలగిపోవాలి. భవిష్యత్ చిత్రపటం స్పష్టంగా రూపొందించుకోవాలి. ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని శాంతయుతంగా, సామరస్యంగా అమలు చేయడానికి అవసరమైన కార్యాచరణ పథకం రూపొందించాలి.

ఇంతకాలం ఆడిన ఆటలు చాలు. దాగుడుమూతలు చాలు. చేసిన విన్యాసాలు చాలు. వ్యూహరచన చాలు. వేసిన ఎత్తుగడలు చాలు. ప్రదర్శించిన నాటకీయత చాలు. వంచనశిల్పం చాలు. జరిగిన ప్రాణనష్టం చాలు. మనోవేదన చాలు. చంద్రబాబు నాయుడిని ఇరకాటంలో పెట్టాలనో, జగన్మోహన్ రెడ్డి ఆటకట్టించాలనో ఆలోచించి, తక్షణ ప్రయోజనాలు ఆశించి పాచికలాడటం మానుకోవాలి. నిజాయితీనీ, పారదర్శకతనూ ప్రజలు హర్షిస్తారని బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు తాజాగా నిరూపించాయి. ప్రతిసారీ సమస్యను దాటవేస్తూ మసిబూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నిస్తే పాలకపక్షానికి ఆంధ్రప్రదేశ్ లో ఆబోరు దక్కదు. దక్షిణాదిన మిగిలిన ఒకే ఒక కోట కుప్పకూలుతుంది. ఇది తాజా ప్రమాద హెచ్చరిక.

No comments:

Post a Comment