పాకిస్తాన్ లో ఉదారవాదారినికీ, హేతువాదానికీ తావు లేని పరిస్థితులను మతవాదులు సృష్టిస్తున్నారు. సమాజంలో మతవాదుల ఆధిపత్యం వేగంగా, ప్రమాదకరంగా పెరుగుతోంది. ఆత్మాహుతి దాడులు పెరిగిపోతున్నాయి. ఉదారవాదుల నోళ్ళు మూయించడానికీ, వారిని అణచివేయడానికి మతసంస్థలు పూనుకున్నాయి. ప్రభుత్వం నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతున్నది. మంగళవారంనాడు పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్ర గవర్నర్ సల్మాన్ తసీర్ దారుణ హత్య ఈ ధోరణికి తాజా నిదర్శనం. ఇందిరాగాంధీని అంగరక్షకుడు కాల్చి చంపినట్టే తసీర్ ను కూడా ఆయన అంగరక్షకుడు మలిక్ ముంతాజ్ హుస్సేన్ ఖాద్రీ అనేక విడతల కాల్పులు జరిపి హత్య చేశాడు. ఇందిర హంతకులదీ మతావేశమే. తసీర్ హంతకుడిదీ మతావేశమే.
పాకిస్తాన్ లో దైవదూషణ చట్టాన్ని సవరించాలని ఉదారవాదులు కొంతకాలంగా కోరుతున్నారు. దైవదూషణకు ఒడిగట్టిందనే ఆరోపణపై ఆసియా బీబీ అనే క్రైస్తవ మహిళకు నిరుడు నవంబరులో కోర్టు మరణశిక్ష విధించింది. చాలామంది ఉదారవాదులతో పాటు పంజాబ్ గవర్నర్ కూడా ఆసియా బీబీ కేసును తిరిగి సమీక్షించాలనీ, దైవదూషణ చట్టాన్ని సవరించాలని కోరాడు. షెక్ పురా జైలులో ఉన్న ఆసియా బీబీని కలుసుకొని సంఘీభావం ప్రకటించాడు. ఆమెకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ దేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి వినతిపత్రం పంపించాడు. మతవాదులు ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ తసీర్ తన వైఖరి మార్చుకోలేదు. దైవదూషణ చట్టానికి సవరణ తేవాలన్న వాదనకు వ్యతిరేకంగా మతవాదులు మంగళవారంనాడు ఇచ్చిన బంద్ పిలుపును వ్యతిరేకిస్తూ తసీర్ తన ట్విట్టర్ లో రాసుకున్నాడు. ‘దైవదూషణ చట్టం విషయంలో లొంగిపోవలసిందిగా నాపైన మతవాదుల ఒత్తిడి తీవ్రంగా ఉంది. నేను లొంగిపోవడానికి నిరాకరించాను. ఇందుకోసం నిలబడిన చివరి మనిషిని నేను ఒక్కడినే అయినా సరే రాజీ ప్రసక్తి లేదు’ అంటూ తసీర్ తన హత్యకు కొన్ని గంటల ముందు ట్విట్టర్ లో నిర్ద్వంద్వంగా ప్రకటించాడు.
పాకిస్తానీయుల మానసిక స్థితికి అద్దం పట్టే బ్లాగులనూ, ట్విట్టర్లనూ పరిశీలిస్తే ఆ దేశంలో ఉదారవాదులకూ, మతవాదులకూ మధ్య పోరాటం ఏ స్థాయిలో జరుగుతోందో తెలుస్తుంది. ‘సల్మాన్ తసీర్ వెళ్ళిపోయాడు. కానీ ప్రతి వీధిలోనూ, ప్రతి మలుపులోనూ, ప్రతి వార్తా సంస్థలోనూ ఖాద్రీలు ఉన్నారు. పాకిస్తాన్ ను కేన్సర్ పీడిస్తోంది’ అంటూ ఒక ఉదారవాది తన బ్లాగ్ లో వాపోయాడు. కొన్ని వారాల కిందట పాకిస్తాన్ లో ప్రజాస్వామ్య పౌరుల సంస్థ ‘సిటిజెన్స్ ఫర్ డెమాక్రసీ’ వెలిసింది. పాకిస్తాన్ లో ఫాసిస్టు వ్యవస్థను నెలకొల్పడానికి మతవాదులు హింసను ఆయుధంగా చేసుకున్నారంటూ ఈ సంస్థ వ్యాఖ్యానించింది. ఆసియా బీబీని హత్య చేసినవారికి యాభై వేల రూపాయల బహుమతి ప్రకటించిన ముల్లా పైన సర్కార్ ఎటువంటి చర్యా తీసుకోకపోవడాన్ని ఈ సంస్థ విమర్శించింది. దైవదూషణ చట్టాన్ని కనుక సవరిస్తే పాకిస్తాన్ లో ‘ఖూన్ కీ నదియా- నెత్తుటి నదులు’ పారుతాయంటూ ఆ ముల్లా హెచ్చరించాడు. మతవాదులకు పాలకుల మద్దతు ఉండటం, మతమే పాకిస్తాన్ రాజ్యానికి ఆయువుపట్టు కావడం వల్ల మతవాదులపైన ప్రభుత్వాలు చర్యలు తీసుకునే ఆస్కారం లేదు. దైవదూషణ చట్టానికి సవరణ చేయాలంటూ వాదిస్తున్న మరో ప్రముఖ పాకిస్తానీ రాజకీయవేత్త షెర్రీ రెహమాన్ భద్రత గురించి పౌరులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.
తసీర్ ను హత్య చేసిన ఖాద్రీని హీరోగా పరిగణిస్తున్నవారి సంఖ్య తక్కువేమీ లేదు. ఖాద్రీ మద్దతుదారులు తాజాగా ఒక ఫేస్ బుక్ సృష్టించారు. అరెస్టు చేసిన ఖాద్రీని వెంటనే విడుదల చేయించేందుకు అవసరమైన నిర్ణయం ప్రకటించవలసిందిగా పాకిస్తాన్ సుప్రీకోర్టుకు వందలాదిమంది ఈ పేస్ బుక్ ద్వారా విజ్నప్తి చేస్తున్నారు. మతవాదులకూ, ఉదారవాదులకూ ఈ ఫేస్ బుక్ లో భీకరమైన వాగ్వాదం సాగుతోంది. పాకిస్తాన్ సమాజంలో నెలకొన్న సంక్షోభానికి ఈ ధోరణులు అద్దం పడుతున్నాయి. మతోన్మాదం, ఉగ్రవాదం. తాలిబాన్ ప్రభావం, ముల్లాల ఆధిపత్యం, మతవాదులకు రాజకీయ పార్టీల ప్రాధాన్యం, ఇస్లామీయ రాజ్యంగా పాకిస్తాన్ ను ప్రకటించడం వంటి అనేక చర్యల ద్వారా పాకిస్తాన్ పాలకులే ఇటువంటి ప్రమాదకరమైన ధోరణిని ప్రోత్సహించారు. నిజానికి ఈ రోజున సైతం పాకిస్తాన్ సమాజంలో మతవాదుల కంటే ఉదారవాదులే ఎక్కువ. కానీ రాజ్యం మద్దతు మతవాదులకు ఉండటం, మతవాదులకు తీవ్రమైన అభిప్రాయాలు ఉండటం, తమ వాదనతో ఏకీభవించనివారిని చంపివేయడమే విధానంగా నిర్ణయించుకోవడంతో పాకిస్తాన్ లో సంక్షోభం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఇది భారత ఉపఖండానికి ప్రమాద హేతువు.
(ఈ వ్యాసాన్ని శ్రీ రామచంద్రమూర్తి గారు.. hmtv సంపాదకీయం "హంసధ్వని" కోసం 05-01-2011న రాశారు. శ్రీ మూర్తిగారి మరిన్ని hmtv సంపాదకీయ వ్యాసాలు చూడాలనుకుంటే.. www.hmtvhamsadhwani.blogspot.com క్లిక్ చేయండి)
No comments:
Post a Comment