ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెల్లడయింది. యథాతధస్థితిని కొనసాగించడం ఇకమీదట సాధ్యం కాదని నివేదిక ప్రారంభంలోనే కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఆరు సూచనలను చేసింది. ఆరు ప్రత్యామ్నాయాలనూ వివరించింది. ప్రతి సూచనపైనా తన వ్యాఖ్యలు చేసింది. ఆరు ప్రతిపాదనలు చేసినప్పటికీ మొదటి మూడు ప్రతిపాదనలనూ అమలు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. చివరి మూడు ప్రతిపాదనలనే పరిశీలించాలన్నది కమిటీ అభిమతం. అందులోనూ హైదరాబాద్ చుట్టూ నాలుగు జిల్లాలను కలిపి కేంద్ర పాలిత ప్రాంతంగా పరిగణించాలన్న సరికొత్త సూచనను తెలంగాణవాదులు గట్టిగా ప్రతిఘటిస్తారని కమిటీనే చెప్పింది. మిగిలినవి అయిదో సిఫార్సు, ఆరో సిఫార్సు. ఆరో సిఫార్సుకు కమిటీ అగ్రతర ప్రాధాన్యం ఇచ్చింది. తెలంగాణ సామాజికార్థికాభివృద్ధికి అవసరమైన హామీలను రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలనీ, తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలన్నది శ్రీకృష్ణ కమిటీ చేసిన ఆరో ప్రతిపాదన. ఈ ప్రతిపాదనను అసాధ్యమని భావిస్తే, రాష్ట్ర విభజన అనివార్యమైతేనే అయిదో ప్రతిపాదన పరిశీలించాలని కూడా కమిటీ చెప్పింది. తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ సహితంగా ఏర్పాటు చేయాలనీ, సీమాంధ్ర రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మించాలన్నది అయిదో సిఫార్సు. ఈ ప్రతిపాదనకు మూడు ప్రాంతాల ప్రజలనూ ఒప్పించాలని మెలిక పెట్టింది. మూడు ప్రాంతాల ప్రజలూ రాష్ట్ర విభజనకు అంగీకరించడం జరగని పని. కమిటీ చేసిన ఆరు సూచనలతో పాటు సుదీర్ఘమైన నివేదికలో అనేక వ్యాఖ్యలు చేసింది. నిశితంగా పరిశీలిస్తే చాలా వ్యాఖ్యల పట్ల అన్ని ప్రాంతాలవారికీ అభ్యంతరాలు ఉంటాయి.
ఏ ప్రాంతం ప్రజలు ఏమేమి కోరుకుంటున్నారో తెలుసుకొని నివేదిక రాయడానికి మాజీ న్యాయమూర్తులూ, మాజీ ఐఏఎస్ అధికారులూ, అధ్యాపక ప్రముఖులూ అక్కరలేదు. ఢిల్లీ నుంచి పనికట్టుకొని రానక్కరలేదు. హెచ్ఎంటీవీ హైదరాబాద్ లోనూ, రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ ఏడు మాసాలపాటు నిర్విరామంగా నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్ దశ-దిశ’ కార్యక్రమాలను ఢిల్లీలో కూర్చొని వీక్షించి ఉంటే ఇంతకంటే మెరుగైన నివేదిక ఇవ్వగలిగేవారు. ‘దశ-దిశ’ కార్యక్రమాలలో సుమారు పదివేల మంది పాల్గొన్నారు. పదిహేను వందల మంది తమ అభిప్రాయాలను స్వయంగా వ్యక్తం చేసి రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాలలోనూ, విదేశాలలోనూ లక్షలాదిమంది హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు వినిపించారు. ఇంతమందిని శ్రీకృష్ణ కమిటీ సభ్యులు సంవత్సరం కాలంలో కలిసి ఉండరు. ఇన్ని అభిప్రాయాలు సేకరించి ఉండరు. పైగా ‘దశ-దిశ’ కార్యక్రమాల డీవీడీలను కమిటీ కార్యదర్శి దుగ్గల్ మహాశయుడికి సమర్పించాం. ‘దశ-దిశ’ కార్యక్రమం తమ పనిని సులువు చేసిందని కూడా ఆయన ఢిల్లీ మీడియా సమావేశంలో అభినందించారు. ఏ ప్రాంతం ప్రజలలో అధిక సంఖ్యాకులు ఏమి అనుకుంటున్నారో తెలియజేయడమే శ్రీకృష్ణ కమిటీ లక్ష్యం అయినట్లయితే ఇంత హడావుడి, ఇంత ప్రచారం, ఇంత ఉత్కంఠ అనవసరం. వాస్తవానికి ఇటువంటి కమిటీలకు ఉన్న పరిమితులు తెలియక ప్రజలు శ్రీకృష్ణ కమిటీ నుంచి ఎక్కువ ఆశించి ఉంటారు. ఒకే ఒక సిఫార్సు చేయాలని కోరుకొని ఉంటారు. ఇది కమిషన్ కాదు. కేవలం కమిటీ. హోంశాఖ నియమించిన సంఘం. ఇటువంటి కమిటీ ఏదైనా ఏదో ఒక్క సిఫార్సు చేయలేదు. ఒకటికి మించి సిఫార్సులను చేసి వాటిలో ఏదో ఒక ప్రతిపాదనను స్వీకరించే సావకాశం ప్రభుత్వాలకు కల్పించడం ఆనవాయితీ. అదే పద్ధతిలో శ్రీకృష్ణ కమిటీ వ్యవహరించింది. కమిటీ చేసినవీ, చేయగలిగినవీ సూచనలే కానీ నిర్ణయాలు కాదని అందరూ అర్థం చేసుకోవాలి.
‘దశ-దిశ’ కార్యక్రమాలలో ప్రస్తావనకు వచ్చి శ్రీకృష్ణ కమిటీ చేసిన సిఫార్సులలో ప్రస్తావనకు రాని అంశాలు రెండు. ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాలని కొందరు సీమవాసులు చేసిన వాదనను కమిటీ పరిగణించినట్టు లేదు. ఉత్తరాంధ్రలో కూడా కొందరు ప్రత్యేక కళింగాంధ్రను ఏర్పాటు చేయాలనే అభిప్రాయాన్ని బలంగా వినిపించారు. ఈ రెండు వాదనలనూ వినిపించినవారి సంఖ్య గణనీయమైనది కాదు కనుక కమిటీ పట్టించుకోకుండా వదిలిపెట్టడాన్ని అర్థం చేసుకోవచ్చును. కానీ ఎక్కడా వినిపించని కొత్త వాదాన్ని ప్రజల ముందుకు తేవడాన్ని అర్థం చేసుకోవడం కష్టం. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలను కలిపి హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలన్నది కమిటీ సృష్టించిన సంచలనాత్మకమైన కొత్త ప్రతిపాదన. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగానో, ఉమ్మడి రాజధానిగానో చేయాలని చాలామంది ‘దశ-దిశ’ కార్యక్రమాలలో కోరారు. కానీ చుట్టుపక్కల ఉన్న నాలుగు జిల్లాలలనూ హైదరాబాద్ లో కలిపి విస్తారమైన కేంద్ర పాలిక ప్రాంతంగా ప్రకటించాలని ఎవ్వరూ కలలోనైనా కోరలేదు. ఇది కమిటీ సభ్యుల బుర్రల్లో పుట్టిన ఆలోచన అనుకోవాలి. యాభై నాలుగు సంవత్సరాలుగా సాగుతున్న వాదోపవాదాలు కొత్త పుంతలు తొక్కడానికి అవసరమైన అంశాలను కమిటీ తన నివేదికలో చేర్చడం నిశ్చయంగా ఆక్షేపణీయం. సమస్యను జటిలం చేయడం ధర్మం కాదు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలా లేక సమైక్య రాష్ట్రంగా కొనసాగాలా అన్నదే ప్రధానంగా చర్చనీయాంశం. ఈ రెండు వాదనలలో ఏ వాదం సమంజసంగా ఉన్నదో, ఏది అత్యధిక సంఖ్యాకులకు ఆమోదయోగ్యమో పరిశీలించడం పరమావధి.
ఆరో ప్రతిపాదన ఉత్తమమైనదనీ, అయిదో ప్రతిపాదన రెండో ప్రాధాన్యం ఇవ్వదగినదనీ కమిటీ అంటోంది. అంటే, తెలంగాణ సామాజికార్థిక అభివృద్ధికి దోహదం చేసే విధంగా ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయడం, దానికి విశేషాధికారాలు ఇవ్వడం, రాజ్యాంగబద్ధమైన హామీలు ఇవ్వడం ద్వారా సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించడం కమిటి ప్రధమ ప్రాధమ్యం ఇచ్చిన సిఫార్సు. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి, సీమాంధ్ర రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మించడం రెండవ ప్రతిపాదన.
ఆరో ప్రతిపాదనకూ, మొదటి ప్రతిపాదనకూ పెద్ద తేడా లేదు. సామాజికార్థిక అభివృద్ధికి మండలాలు ఏర్పాటు చేయడం కొత్త ఆలోచన కూడా కాదు. తెలంగాణ కమిటీకి ఇప్పటికీ ఉప్పనూతల పురుషోత్తమరెడ్డి అధ్యక్షుడే. సీమాంధ్ర, రాయలసీమ కమిటీల అధ్యక్షులు బాధ్యతలు స్వీకరించడానికి సైతం నిరాకరించారు. లోగడ చొక్కారావు వంటి నాయకుల నేతృత్వంలో ప్రాంతీయ మండళ్ళు పని చేశాయి. అన్ని ఒప్పందాల మాదిరే ఈ మండళ్ళు కూడా సవ్యంగా అమలు జరగలేదు. దీనికి కారణం పాలకులకు న్యాయభావన కొరవడటం. రాజ్యాంగపరమైన హామీలు ఎన్ని ఇచ్చినా పాలకులలో న్యాయభావన లేకపోతే హామీలు అమలుకు నోచుకోవన్నది అనుభవం నేర్పుతున్న పాఠం. ఒప్పందాలు అమలు కాకపోవడమే ప్రస్తుత సమస్యకు కారణమంటూ శ్రీకృష్ణ కమిటీ నివేదించింది. మళ్ళీ అటువంటి హామీలు ఇచ్చి సమైక్య గీతాలాపన కొనసాగించాలని సూచిస్తోంది. ఇందులో వైరుధ్యం ఉన్నప్పటికీ ఆరో సూత్రాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే, నిర్ణయం అమలుకు చాలా గట్టి చర్యలు తీసుకోవలసి ఉంటుంది. రాజ్యాంగపరమైన హామీలు ఇచ్చి వాటిని పరిరక్షించేందుకు పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను రూపొందించవలసి ఉంటుంది. షరతులు లేని సమైక్య రాష్ట్రం కావాలని కోరుతున్నవారు తెలంగాణకు ప్రత్యేకమైన హామీలు ఇవ్వడాన్ని హర్షిస్తారో లేదో తెలుసుకోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితులు లేకపోతే అయిదో సూచనే శరణ్యం అవుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా సరే అందరితో సాకల్యంగా చర్చించాలి. విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి.
ఒక్కొక్క పార్టీ నుంచి ఇద్దరేసి ప్రతినిధులను ఆహ్వానించడం వల్ల ప్రయోజనం లేదని తేలిపోయింది. అదే పద్ధతిని కొనసాగించడంలో అర్థం లేదు. వ్యవహారాన్ని తేల్చకుండా నాన్చడానికి మాత్రమే ఈ పద్ధతి పనికి వస్తుంది. పార్టీల అధ్యక్షులను పిలిపించుకొని ప్రధాని, హోంమంత్రి మాట్లాడాలి. అఖిలపక్ష సమావేశాలలో కాదు. నేరుగా ముఖాముఖి మాట్లాడాలి. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రాంతాలవారీగా రెండుగా చీలిన మాట కంటికి కనిపిస్తున్న వాస్తవం. ఆ పార్టీల తరఫున పీసీసీ అధ్యక్షుడు కానీ తెలుగుదేశం పార్టీ అధినేత కానీ ప్రత్యేక తెలంగాణ అనో సమైక్య రాష్ట్రం అనో ఏదో ఒక నిర్ణయం తీసుకుని బహిరంగంగా ప్రకటించే పరిస్థితి లేదు. పీసీసీ అధ్యక్షుడు ఈ బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షురాలిపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా పెడుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మౌనంగా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అధిష్ఠానం ఎట్లా చెబితా అట్లా నడుచుకుంటాం అన్నది వారి మంత్రం. టీడీపీ అధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వమే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. కేంద్రం ఏ నిర్ణయం చేసినా సరే అది తమ తమది కాదనీ, కేంద్ర ప్రభుత్వానిదనీ కార్యకర్తలకు నచ్చజెప్పే అవకాశం తెలుగుదేశం అధినేతకు కావాలి. రెండు కళ్ళ విధానాన్ని అనుసరిస్తున్న టీడీపీ అధినేత మరోవిధంగా ముందుకు పోవడం సాధ్యం కాదు. రాష్ట్ర రాజకీయ నాయకులే తుది నిర్ణయం తీసుకోవాలంటూ గతంలో చిదంబరం, ఇటీవల వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలు పలాయనవాదానికి సంకేతాలు. సమస్యను పరిష్కరించకుండా వాయిదా వేయడానికి చూపించే సాకులు. మీనమేషాలు లెక్కపెట్టడానికీ, ఆషామాషీ వ్యాఖ్యలు చేయడానికి ఇది తరుణం కాదు. నిప్పుతో చెలగాటం ఆడటం మంచిది కాదు. పేరామిలటరీ దళాలను రంగంలో దింపి, కేంద్ర ప్రభుత్వం అస్పష్టమైన సంకేతాలు పంపడం వల్ల తీరని నష్టమే కానీ రవ్వంత ప్రయోజనం లేదు. రాష్ట్రంలో కొన్ని మాసాలుగా నెలకొన్న అనిశ్చితిని తొలగించే బాధ్యత కేంద్రానిదే. బాధ్యతాయుతమైన, దూరదృష్టి కలిగిన, నిర్మాణాత్మకమైన నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర స్థాయిలోని రాజకీయ పక్షాలు మనస్ఫూర్తిగా సహకరించాలి. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ దాని అమలుకు అనుకూలమైన వాతావరణం కల్పించడానికి ప్రజలు తమ వంతు ప్రయత్నం చేయాలి. ఇప్పటికీ యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ మౌనం కొనసాగించడం రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయడమే అవుతుంది. పరిస్థితులు సంక్లిష్టంగా మారుతున్నా, చేయిజారిపోతున్నా జోక్యం చేసుకోకపోవడం, చక్కదిద్దడానికి ప్రయత్నించకపోవడం క్షమార్హం కాని నేరం అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్యాసదృశం అవుతుంది. ప్రజల పాలిట శాపం అవుతుంది.
No comments:
Post a Comment