పార్లమెంటు ప్రతిష్టంభన కొనసాగుతుందా?
బడ్జెట్ సమావేశాలలో సైతం ఇదే వరుస కొనసాగుతుందా?
యూపీఏను గద్దె దించే వరకూ ప్రతిపక్షాలు విశ్రమించవా?
1977, 1989, 1991 నాటి పరిణామాలు పునరావృతం కానున్నాయా?
అవినీతి ఆరోపణలు కాంగ్రెస్ కు మరోసారి శాపం కానున్నాయా?
లోక్ సభ మధ్యంతరం తథ్యమా?
ఢిల్లీపైన పొగమంచుతో పోటీపడుతూ రాజకీయ కాలుష్య మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఎత్తులూ, పైఎత్తులూ వేస్తూ అనూహ్యమైన రణతంత్రం నడిపిస్తున్నాయి. టూజీ స్పెక్ట్రమ్ ఊబిలో పీకల వరకూ కూరుకుపోయిన యూపీఏ సర్కారు కుంభకోణంపై నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి రకరకాల జిత్తులు ప్రదర్శిస్తున్నది. కాంగ్రెస్ సీనియర్ నాయకుల నుంచీ, ప్రభుత్వ శాఖల నుంచీ స్పష్టాస్పష్టమైన ప్రకటనలు వెలువడుతున్నాయి. నీరా రాడియా విదేశీ గూఢచారి అన్నది ఇటువంటి ప్రకటనలలో ఒకటి కావచ్చు. ముంబయ్ పైన ఉగ్రవాదులు జరిపిన దాడిలో మరణించిన పోలీసు ఉన్నతాధికారి కర్కరే హిందూత్వవాదుల నుంచి బెదిరింపులు వచ్చాయని తనకు చెప్పాడంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ చేసిన సంచలనాత్మక ప్రకటన సైతం ఒకానొక వ్యూహంలో భాగం కావచ్చు. పార్లమెంటు సమావేశాలు ఒక్క నిమిషం చర్చ జరగకుండానే గందరగోళం మధ్య ముగిశాయి. ప్రతిరోజూ ప్రతిష్టంభనే. ప్రతిపక్షాలు సభాపతి దగ్గరికి వెళ్ళి గోలచేయడం, అధికార పక్షం మౌనంగా తిలకించడం, విధిలేక సభాపతి సభను వాయిదా వేయడం మూడువారాల పాటు నిత్యకృత్యంగా మారింది. టూజీ స్ప్రెక్ట్రమ్ వ్యవహారంపై అధ్యయనం చేయడానికి పార్లమెంటు సంయుక్త సంఘాన్ని(జేపీసీని) నియమించవలసిందేనంటూ ప్రతిపక్షాలు పట్టుపట్టడం, ససేమిరా కుదరదంటూ అధికారపక్షం తేల్చిచెప్పడంతో సర్కోన్నత చట్టసభ స్తంభించింది. టూజీ స్ప్రెక్ట్రమ్ వివాదం సృష్టించిన రాజకీయ సంక్షోభం పరిష్కారమయ్యే సూచనలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఊబిలో ఊపిరాడని అధికార పక్షాన్ని పూర్తిగా భ్రష్టుపట్టంచాలన్నది ప్రతిపక్షం ప్రయత్నం. ఏదో ఒక ఉపాయంతో అపాయం నుంచి తప్పించుకొని గట్టెక్కాలన్నది అధికార పక్షం తాపత్రయం. అందుకే కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై వచ్చిన అవినీతి ఆరోపణలను పదేపదే ప్రస్తావించడం. ఆరోపణలు వచ్చిన కారణంగా ముఖ్యమంత్రికి ఉద్వాసన చెప్పాలంటూ కాంగ్రెస్ ఉద్ఘోషించడం. యడ్యూరప్ప నీతిమంతుడేమీ కాదు. కానీ అతని అవినీతికీ, రాజా అవినీతికీ పొంతన లేదు. జేబుకొట్టడానికీ, హత్యచేయడానికీ మధ్య ఉన్నంత అంతరం ఉంది. యూపీఏ అవినీతి ప్రభుత్వం అంటూ వచ్చిన ఆరోపణకు సమాధానం బీజేపీ ఆధ్వర్యంలోని కర్ణాటక ప్రభుత్వం అవినీతిమయమైనదన్న ప్రత్యారోపణ. రెండు ఆరోపణలూ నిజమే అయినప్పటికీ ఒకదానికి ఒకటి చెల్లు అవుతాయా? త్వం శుంఠ అంటే త్వం శుంఠ అన్నంత మాత్రాన ఇద్దరూ నిర్దోషులవుతారా? ఇది నీతిమాలిన రాజకీయం. మొత్తంమీద రాజకీయ పక్షాల నిష్ఫల విన్యాసాల ఫలితంగా ప్రజాస్వామ్యం మరోసారి అపహాస్యం పాలవుతోంది. ఈ సమావేశాలలో కనిపించిన తంతు రేపు బడ్జెట్ సమావేశాలలో కూడా పునరావృత్తం అయితే మధ్యంతర ఎన్నికలు మినహా మరో గత్యంతరం లేకపోవచ్చు.
పార్లమెంటులో ప్రతిష్టంభన పరిష్కారం కాకుండా మొండికేసిన సందర్భాలలో మధ్యంతరమే గత్యంతరమైన ఉదంతాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలకు అవినీతి ఆరోపణలు శాపం. అవినీతి ఆరోపణల కారణంగా కేంద్రంలో కనీసం మూడు విడతల కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. ఇందిరాగాంధీ 1975లో ఆత్యయిక పరిస్థితి ప్రకటించడానికి దారితీసిన కారణాలలో ఇందిర ఎన్నికల చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు ఒకటి మాత్రమే. ఇతర కారణాలు అనేకం ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి అవినీతి ఆరోపణలు. అవినీతికి వ్యతిరేకంగా గుజరాత్ లో 1973లో ప్రారంభమైన నవనిర్మాణ్ ఆందోళన కాంగ్రెస్ కు ప్రత్నామ్నాయాన్ని సృష్టించింది. ఈ ఆందోళనకు ఆత్యయిక పరిస్థితి పట్ల వ్యతిరేకత తోడై మహాప్రభంజనంగా మారి 1977లో ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయానికి దారితీసింది. సరిగ్గా పదేళ్ళ తర్వాత 1987లో బోఫోర్సు కుంభకోణంపైన పార్లమెంటు సభ్యుల దర్యాప్తు కోరుతూ పార్లమెంటులోని ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో కోరాయి. నాటి ప్రధాని రాజీవ్ గాంధీ జేపీసీ నియామకానికి అంగీకరించలేదు. ప్రతిపక్షాలన్నీ ఏకమై ఆందోళన చేసిన తర్వాత జేపీసీ నియామకానికి ప్రభుత్వం ఒప్పుకుంది. తీరా జేపీసీ నివేదిక సమర్పించిన తర్వాత నివేదికను ఆమోదించేది లేదంటూ ప్రతిపక్ష సభ్యులందరూ రాజీనామా చేశారు. బోఫోర్స్ అంశంపైన భారతీయ జనతా పార్టీ, వామపక్షాలు కలసికట్టుగా పోరాటం చేయడం విశేషం. వీపీ సింగ్, అరుణ్ నెహ్రూ వంటి ముఖ్యమైన కాంగ్రెస్ నేతలు రాజీవ్ కు ఎదురు తిరగడం సరేసరి. రాజకీయ ప్రతిష్టంభన కారణంగా గడువు కంటే కొన్ని మాసాలు ముందుగానే లోక్ సభ ఎన్నికలు జరిగాయి. పీవీ నరసింహారావు హయాంలో 1995లో సుఖరామ్ పైన అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు కూడా పార్లమెంటును ప్రతిపక్షాలు స్తంభింపజేశాయి. అంతకు ముందే హర్షద్ మెహతా హవాలా వ్యవహారం కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. మైనారిటీలో ఉన్న ప్రభుత్వాన్ని మెజారిటీలోకి తెచ్చుకోవడానికి జార్ఖండ్ ముక్తి మోర్చా సభ్యులను నగదు చెల్లించి కొనుగోలు చేయడం ప్రభుత్వాన్ని అప్రదిష్ఠపాలు చేసింది. బాబరీ మసీదు విధ్వంసం, హర్షద్ మెహతా కుంభకోణం, సుఖరాం అవినీతి, జైన్ డెయిరీ ఉదంతం కారణంగా పీవీ సర్కార్ బాగా బదనాం అయింది. కొద్ది మాసాలలోనే సార్వత్రిక ఎన్నికలు జరగవలసి ఉన్న కారణంగా మధ్యంతరం అవరసం లేకపోయింది. కానీ అవినీతి ఆరోపణలపైన చెలరేగిన దుమారం 1996 ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమికి దారి తీసింది.
కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారకూటమిని శంకరగిరిమన్యం పంపించేందుకు దొరికిన అవకాశాన్ని చేజార్చుకోలేదు. 1997లో జైన్ కమిషన్ నివేదికపైన కాంగ్రెస్ సంధించిన ఆందోళనాస్త్రం యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కూల్చివేసింది. ఏ రాజకీయ పార్టీకీ మధ్యంతర ఎన్నికలు ఇష్టం లేకపోయినా పరిస్థితులు అటువైపే దారితీశాయి. నాటి ప్రధాని ఐకే గుజ్రాల్ కు తన ప్రభుత్వం ఎందుకు పడిపోయిందే ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. ఢిల్లీ రాజకీయం అంత నిగూఢంగా, నిర్దయగా, నిరంకుశంగా ఉంటుంది. అందుకే ఢిల్లీని మారామారీ షహర్ అంటారు.
అవినీతి ఆరోపణలపైన ప్రతిపక్షాలు ఉధృతం చేసిన ఉద్యమానికి నైతికస్థాయి కల్పించడానికి నాడు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఉన్నారు. రాజీవ్ గాంధీ పట్ల ప్రజలలో ఏర్పడిన వ్యతిరేక భావాన్ని ఓట్లుగా మార్చడానికి వీపీ సింగ్ ఉన్నారు. పీవీ, గుజ్రాల్, దేవెగౌడ ప్రభుత్వాల పట్ల ప్రజలలో పేరుకుపోయన ప్రతికూలతను సొమ్ము చేసుకోవడానికి అటల్ బిహారీ వాజపేయి ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు ముందుకు తెస్తున్న ప్రభుత్వ వ్యతిరేక భావాన్ని ప్రతిపక్షాలకు అనుకూలంగా మార్చుకోవడానికీ, మధ్యంతర ఎన్నికలను అనివార్యం చేయడానికీ, ఎన్నికలలో గెలుపొందడానికీ అటువంటి అగ్రనాయకుడి నేతృత్వం లేదు. ప్రతిపక్ష నాయకత్వ స్థానంలో ఏర్పడిన ఖాళీని అడ్వానీ భర్తీ చేయలేకపోయారు.
రెండో సారి యూపీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి ఆరోపణలకు అకస్మాత్తుగా ఊతం వచ్చింది. విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి శశి థరూర్ ది మొదటి ఉదంతం. ఐపిఎల్ క్రికెట్ లో కోచ్చి జట్టుకు అనుచితంగా ఉపకారం చేసి అక్రమంగా లబ్ది పొందారనే ఆరోపణపై ఆయన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. కామన్వెల్త్ క్రీడోత్సవంలో అసాధారణమైన అవినీతినీ, అసమర్థతనీ దేశ ప్రజలు నివ్వెరపోయే విధంగా ప్రదర్శించి సురేష్ కల్మాడీ బంగారు పతకం దక్కించుకున్నాడు. సురేష్ ను పక్కన పెట్టారు. అనంతంర ఆదర్శ్ సొసైటీ కుంభకోణం కారణంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి అశోక్ చవాన్ కు ఉద్వాసన చెప్పారు. ఆ తర్వాత టూజీ స్ప్రెక్ట్రమ్ కుంభకోణం అసహ్యంగా పూర్తి వెలుగులోకి వచ్చింది. రెండేళ్ళు దాగుడుమూతల తర్వాత రాజా సైతం తప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. కామన్వెల్త్, ఆదర్శ్ కుంభకోణాలలో ప్రధానిపైనా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాపైనా ఎటువంటి ఆరోపణలూ రాలేదు. పర్యవేక్షణ లోపానికి సంబంధించిన విమర్శలే కానీ అవినీతిలో వారికి ప్రమేయం ఉన్నట్టు కానీ, అవినీతిని ఉపేక్షించినట్టు కానీ నిందారోపణలు పెద్దగా రాలేదు. కానీ టూజీ స్ప్రెక్ట్రమ్ కుంభకోణంలో అవినీతికి పాల్పడుతున్నమంత్రిని తొలగించకుండా రెండేళ్ళపాటు ఎందుకు కొనసాగించారంటూ ప్రధాని మన్మోహన్ సింగ్ ను నిలదీసే అవకాశం ప్రతిపక్షాలకు లభించింది. ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినప్పటికీ ప్రధానిగా నైతిక బాధ్యత స్వీకరించి రాజీనామా చేయకుండా పదవి పట్టుకొని వేళ్ళాడుతున్నారనే విమర్శ కూడా మన్మోహన్ సింగ్ ని వేధిస్తున్నది. మన్మోహన్ వారించినా వినకుండా రాజాను మంత్రివర్గంలోకి తీసుకోవలసిందిగా ఒత్తిడి చేయడమే కాకుండా అవినీతి ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా రాజాకు ఉద్వాసన చెప్పకుండా అడ్డుపడిన సోనియాగాంధీ కూడా నింద భరించవలసి వస్తున్నది. అవినీతి సొమ్ములో పెద్ద వాటా సోనియా సోదరీమణులకు ముట్టిందంటూ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యస్వామి చేస్తున్న ఆరోపణలకు పెద్దగా ప్రాచుర్యం రాలేదు. కానీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవలసిన అవసరం సోనియాకూ, మన్మోహన్ కూ ఉంది. పార్లమెంటును స్తంభింపజేసిన ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా అవినీతి వ్యతిరేక ఉద్యమం ప్రారంభించబోతున్నాయి. కాంగ్రెస్ ను ఎండగట్టడం, అపఖ్యాతిపాలు చేయడం ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యం.
మొత్తం మీద కాంగ్రెస్ కష్టకాలం ప్రారంభమైంది. గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత బీహార్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చావుదెబ్బ తిన్నది. అవినీతి ఆరోపణలు తీవ్రతరమై నిరసన ఉద్యమరూపం సంతరించుకున్న ప్రతిసారీ కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. ఆరోపణలపైన విచారణ జరిగి నిజం నిగ్గు తేలకముందే ఎన్నికలు రావడం, న్యాయస్థానాల కంటే ముందుగానే ప్రజలే తీర్పు ఇవ్వడం ఆనవాయితీగా మారింది. ప్రతిష్టంభన పరిష్కారం కాకపోతే గడువు కంటే ముందుగానే ఎన్నికలు జరిగిన దృష్టాంతం కూడా ఉంది. అందుకే కాంగ్రెస్ వర్గాల్లో మధ్యంతరం మాట వినిపిస్తోంది.
వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో పశ్చిమ బెంగాల్ , కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో వామపక్ష సంఘటన ఓడిపోతే యూపీఏకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముమ్మరం చేసే అవకాశం ఉంది. డీఎంకే అధినేత కరుణానిధి ఇప్పటికే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రాజా ఒక్కడే అవినీతి సొమ్మును భోజనం చేశాడంటే నమ్మడం కష్టం అంటూ కరుణానిధి చేసిన వ్యాఖ్యలో అర్థం కాంగ్రెస్ నేతలు సైతం మేసి ఉంటారని. రాజా దోషి అని రుజువైతే పార్టీపరంగా చర్య తీసుకుంటామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ విధంగా మాట్లాడం అవసరం. తమిళనాడులో కరుణానిధి కుటుంబ పాలన పట్ల ప్రజలలో తీవ్రమైన ప్రతికూలత కనిపిస్తోంది. జయలలిత ప్రాబల్యం పెరుగుతోంది. వచ్చే సంవత్సరం జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ డీఎంకేతో అనుబంధం కొనసాగిస్తుందో లేక తిరిగి ఏఐఏడిఎంకేతో పొత్తు పెట్టుకుంటుందో తెలియదు. డిఎంకే, ఏఐడిఎంకేలలో ఏ పార్టీ ఓడిపోతే ఆ పార్టీ కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తుంది.
టూజీ స్ప్రెక్ట్రమ్ వ్యవహారంలో పార్లమెంటు సంయుక్త సంఘం దర్యాప్తు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అభ్యంతరం చెబుతున్నదో ఆ పార్టీ నాయకత్వం యూపీఏ భాగస్వామ్య పక్షాలకు నచ్చజెప్పలేకపోతున్నది. జేపీసీకి అనుకూలంగా శరద్ పవార్, మమతాబెనర్జీ వ్యాఖ్యలు చేశారు. భాగస్వాములతో ఏకాభిప్రాయం లేదు. గుజరాత్ లో నరేంద్రమోడీనీ, బీహార్ లో నితీష్ కుమార్ నీ, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ నీ, ఉత్తర ప్రదేశ్ లో మాయావతినీ ఎదుర్కోగల నాయకులు కాంగ్రెస్ పార్టీలో లేరు. దక్షిణాదిలో మిగిలిన ఒకే ఒక్క కంచుకోట ఆంధ్రప్రదేశ్ కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా లేదు. తెలంగాణ అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా సాచివేత ధోరణి ప్రదర్శించడం, జగన్మొహన్ రెడ్డి పార్టీ నుంచి నిష్క్రమించడం కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచే పరిణామాలు.
ఈ నేపథ్యంలో మరి మూడున్నర సంవత్సరాల పాటు యూపీఏ పరిపాలన సాగిస్తే అధికార కూటమి మరింత అప్రదిష్ఠపాటు కావడం మినహా ప్రయోజనం ఉండదు. రాహుల్ గాంధీ జనాకర్షణశక్తి అద్భుతాలు చేస్తుందని ఆశించిన కాంగ్రెస్ వాదులకు బీహార్ ఎన్నికలు ఆశాభంగం కలిగించాయి. 2014 వరకూ నిరీక్షిస్తే కాంగ్రెస్ కు నష్టమే కానీ ప్రయోజనం లేదు. పార్లమెంటును సాగనివ్వడం లేదనీ, పరిపాలన చేయనివ్వడం లేదనీ ప్రతిపక్షాలను తప్పుపడుతూ లోక్ సభను రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు తెరతీయడం ఒక మార్గాంతరం. బీజేపీ ప్రాంతీయ పార్టీలను కూడగట్టుకునే ముందుగానే, ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ కు దూరమై యూపేఏకీ, ఎన్ డీఏకీ ప్రత్యామ్నాయంగా లౌకికవాద కూటమి రూపుదిద్దుకోవడానికి ముందే మధ్యంతర నగారా మోగించడం ఉత్తమమనే ఆలోచన కాంగ్రెస్ నాయకులు చేస్తున్నట్టు భోగట్టా.
No comments:
Post a Comment