Saturday, December 25, 2010

కిరణ్‌కుమార్‌ అన్నీ సవాళ్లే

కాంగ్రెస్ మార్కు రాజకీయం రాష్ట్రంలో మరో సారి ఝలక్ ఇచ్చింది. ఒకే రోజులో పెను మార్పులు సంభవించాయి. ముఖ్యమంత్రి పదవి నుంచి కొణిజేటి రోశయ్య తప్పుకోవడం, గద్దెపైన కిరణ్ కుమార్ రెడ్డి కూర్చోవడం కొన్ని గంటల వ్యవధిలో చకచకా జరిగిపోయాయి. అత్యంత ఆసక్తిదాయకంగా సాగిన ఈ నాటకం నీతి ఏమిటి? కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహం ఏమిటి?

ముఖ్యమంత్రి పదవిలో రోశయ్య సుఖంగా లేరని ఆయనే స్వయంగా అనేక సందర్భాలలో స్పష్టం చేశారు. ఇందుకు కారణం ఆయనకు రాజకీయ అనుభవం లేక కాదు. సామర్థ్యం లేక కూడా కాదు. సొంతబలం లేక. అధిష్ఠానం సహకారం లేక. వై ఎస్ రాజశేఖరరెడ్డి దుర్మరణం తర్వాత తాత్కాలికంగా తనకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారని రోశయ్యకు తెలుసు. అధిష్ఠానానిది సైతం అదే అభిప్రాయం. వచ్చిన అవకాశాన్ని రోశయ్య సద్వినియోగం చేసుకొని ఉంటే, చొరవతీసుకొని సమస్యలను పరిష్కరించి ఉంటే, సమర్థుడైన పాలకుడిగా పేరు తెచ్చుకొని ఉంటే బహుశా అధిష్ఠానం రోశయ్యను మార్చేది కాదు. పరిపాలనా దక్షుడుగా రోశయ్య నిరూపించుకోలేకపోవడంలో ఆయన తప్పు లేదు. తాత్కాలిక ముఖ్యమంత్రి కదా అని రోశయ్యకు అధిష్ఠానం స్వేచ్ఛ ప్రసాదించలేదు. మంత్రివర్గంలో మార్పులకు అనుమతించలేదు. కార్పొరేషన్ల చైర్మన్ల నియామకానికి కూడా అనుమతించలేదు.

రోశయ్య పొరపాట్లూ, పరిమితులూ, అధిష్ఠానం తప్పిదాలతో పాటు కొన్ని కొత్త సమస్యలు ఉత్పన్నమైనాయి. పాత సమస్యలు కొన్ని ఉధృతమై జటిలమైనాయి. పరిస్థితులు అదుపు తప్పినాయి. రాష్ట్రంలో పరిపాలన స్తంభించింది. అధిష్ఠానం జోక్యం చేసుకోక తప్పని పరిస్థితులు ఏర్పడినాయి.

వైఎస్ అకాల మరణం తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నది. రోశయ్య పదవీబాధ్యతలు స్వీకరించి చేయీకాలూ కూడదీసుకునే లోగానే తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. మరోవైపు వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి తనకు ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో ఆగ్రహించి అసమ్మతివాదిగా మారిపోయారు. వైఎస్ మంత్రివర్గాన్నే యథాతధంగా కొనసాగించిన రోశయ్యకు మంత్రులు విధేయత చూపలేదు. కనీస గౌరవం కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయనతో సమాలోచనలు జరిపి సచివాలయానికి రావడం మంత్రులకు ఆనవాయితీగా మారింది. మంత్రులను కట్టడి చేయడానికి దాదాపు సంవత్సరం పట్టింది. అధిష్ఠానం మద్దతు ఉన్నప్పటికీ రోశయ్య జగన్ కార్యకలాపాలను నిరోధించడంలో విఫలమైనారు. ఈ విషయంలో అధిష్ఠానానికి సైతం వైఫల్యమే. సోనియా సలహాను సైతం పెడచెవిన పెట్టి ఓదార్పు పేరుతో జిల్లాలలో విస్తృతంగా పర్యటిస్తూ ఉద్యమ సదృశంగా వైఎస్ విగ్రహాలను ఆవిష్కరిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్న జగన్ ను నిలువరించడానికి అధిష్ఠానమే చర్యలు తీసుకోవాలని రోశయ్య భావించారు. రోశయ్య చొరవ తీసుకోవడం అవసరమని అధిష్ఠానం తలబోసింది. రోశయ్య బలహీనత కారణంగానే తెలంగాణ ఉద్యమం బలపడిందనే అభిప్రాయం కూడా అధిష్ఠానంలో ఉంది. అందుకే చిన్న చిన్న మార్పులు చేయడానికి కూడా రోశయ్యకు అనుమతించలేదు. రోశయ్య స్థానంలో మరొకరిని నియమించాలన్న ఆలోచన అధినేత్రికీ, భావి ప్రధానికీ చాలాకాలంగానే ఉన్నదని అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమాన్ని అరికట్టడంలోనూ, జగన్ ను అదుపు చేయడంలో రోశయ్య విఫలమైనారన్నది అధిష్ఠానం నిశ్చితాభిప్రాయం.

తన బలహీనతలను రోశయ్య స్వయంగా వివరించి రాజీనామా చేస్తున్నట్టు మీడియా సమావేశంలో ప్రకటించారు. రోశయ్య స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డిని నియమించడంలో అధిష్ఠానం వ్యూహం ఏమిటి? కిరణ్ కుమార్ రెడ్డి నుంచి అధిష్ఠానం ఏమి ఆశిస్తున్నది? కొత్త ముఖ్యమంత్రి సామర్థ్యం ఏపాటిది?

కిరణ్ కుమార్ రెడ్డి ఇంత వరకూ మంత్రిగా పని చేయలేదు. వైఎస్ మొదటి ఇన్నింగ్స్ లో చీఫ్ విప్ గా పని చేశారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలో శాసనసభాపతిగా నియుక్తులైనారు. కిరణ్ నియామకం వెనుక రెండు లక్ష్యాలు ఉన్నాయని అనుకోవచ్చు. ఒకటి, జగన్ ను అరికట్టడం. రెండు, డిసెంబర్ తర్వాత తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలలో అల్లర్లు జరగకుండా నివారించడం.

జగన్ యువకుడు. కాంగ్రెస్ పార్టీలో ఆధిక్యం కలిగిన సామాజికవర్గానికి చెందిన నాయకుడు. వైఎస్ వారసుడు. రాయలసీమవాసి. కాంగ్రెస్ లో కొనసాగినా, సొంతపార్టీ పెట్టుకున్న కొరకరాని కొయ్యగా మారగల గండరగండడు. వజ్రం వజ్రేన భిద్యతే అన్న సూత్రాన్ని అనుసరించి అదే సమాజికవర్గానికి చెందిన, అదే ప్రాంతానికి చెందిన యువనాయకుడిని ముఖ్యమంత్రిగా నియమించడం ద్వారా జగన్ కు అధిష్ఠానం స్పష్టమైన సంకేతం పంపింది. కిరణ్ కుమార్ రెడ్డితో సహకరించి పనిచేస్తే సరేసరి, లేకపోతే యుద్ధమే అన్న ‍హెచ్చరిక చేయడం అధిష్ఠానం అభిమతం. కేవీపీ సహకారం తీసుకుంటూ, జగన్ తో సాన్నిహిత్యం పాటిస్తూ అధిష్ఠానం అభీష్టాన్ని నెరవేర్చే చాకచక్యం, చాతుర్యం, చాణక్యం కిరణ్ కుమార్ రెడ్డిలో ఉన్నాయని సోనియాకు నమ్మకం కలిగి ఉండాలి.

శ్రీకృష్ణ కమిటీ డిసెంబర్ చివరిలో నివేదిక సమర్పించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ నిర్ణయమూ తీసుకోకపోయినా తెలంగాణలోనో, సీమాంధ్రలోనో ఉష్ణోగ్రత పెరగడం, అల్లర్లకు దారితీయడం, శాంతిభద్రతల సమస్య ఏర్పడటం అనివార్యం. వయసు మీరిన కారణంగానో, అనారోగ్యం ఫలితంగానో, అనిశ్చితి వల్లనో, స్వభావరీత్యానో రోశయ్య ఖడ్గచాలనం చేయలేరు. గవర్నర్ నరసింహన్, డీజీపీ అరవిందరావుల ఆలోచనా విధానానికి తగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం అవసరమని దేశీయాంగ మంత్రి చిదంబరం భావించి ఉంటారు. కిరణ్ కుమార్ రెడ్డిలో కరుకుదనం, కచ్చితత్వం ఉన్నాయని చిదంబరం భావించి సోనియాను నమ్మించి ఉంటారు.

కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి కావడం రాజకీయ పండితులను ఖంగు తినిపించింది. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి మార్పు ఉంటుందంటూ అకస్మాత్తుగా వదంతులు రావడం, ఒంటి గంటకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు రోశయ్య ప్రకటించడం, మధ్యాహ్నం కల్లా అధిష్ఠానం నుంచి నలుగురు హేమాహేమీలు దూతలుగా రావడం, రాత్రి ఇరవై నిమిషాలలో కాంగ్రెస్ శాసనసభాపక్షం ప్రత్యేక సమావేశాన్ని ముగించడం, కొత్త నాయకుడిని ఎంపిక చేసే అధికారాన్ని సోనియాకు దఖలుపర్చుతూ తీర్మానం చేయడం, ఆ తర్వాత గంటలోపే సోనియాతో ఫోన్ లో మాట్లాడి కొత్త నాయకుడిగా కిరణ్ కుమార్ పేరును ప్రణబ్ ముఖర్జీ ప్రకటించి ఢిల్లీకి తిరిగి వెళ్ళిపోవడం చకచకా జరిగిపోయాయి. గురువారం మధ్యాహ్నం కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పదహారవ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇంత నాటకీయంగా మునుపెన్నడూ నాయకత్వం మార్పు జరగలేదు.
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తీరు కాంగ్రెస్ సాంప్రదాయ వ్యవహార శైలికి తాజా ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీలోశాసనసభ్యుడు కావాలన్నా, మంత్రి కావాలన్నా, ముఖ్యమంత్రి కావాలన్నా పావులు ఎక్కడ ఎట్లా కదపాలో తెలియాలి. వైఎస్ లాగా పదహారు వందల కిలోమీటర్లు నడివేసవిలో కాళ్ళకు బొబ్బలు ఎక్కేటట్టు నడవనక్కరలేదు. జగన్ లాగా ప్రకాశం వంటి చిన్న జిల్లాలో ప్రజలను ఓదార్చడానికి ముప్పయ్ అయిదు రోజులు రాత్రింబవళ్ళు పరిశ్రమించి ఆరోగ్యం చెడగొట్టుకోనక్కర లేదు. శాసన సభ్యులను కూడగట్టనక్కరలేదు. సంతకాలు సేకరించనక్కరలేదు. డబ్బు సంచులు విప్పనక్కరలేదు. కుమారస్వామిలాగా హుటాహుటిగా దేశంలోని అన్ని నదులలో స్నానం చేయనక్కరలేదు. వినాయకుడిలాగా అధిష్ఠానదేవతల చుట్టూ ప్రదక్షిణం చేసి వారిని మెప్పిస్తే చాలు. తాజా పరిస్థితులను చక్కగా సద్వినియోగం చేసుకున్నందుకు కిరణ్ కుమార్ రెడ్డిని అభినందించాలి. అధిష్ఠానం ప్రాధాన్యక్రమం ఏమిటో ఆయన గ్రహించారు. అధిష్ఠానం అభీష్టాన్ని రోశయ్య నెరవేర్చలేక పోతున్నారని తెలుసుకున్నారు. రోశయ్య చేయలేని పనులు తాను చేయగలనని అధిష్ఠానదేవతలకు నమ్మకం కలిగించారు. వారి విశ్వాసం సంపాదించారు. కొందరు మిత్రలు సహకారంతో, అధిష్ఠానం ఆశీస్సులతో చట్టసభాధ్యక్ష పదవి నుంచి నేరుగా ప్రభుత్వ అధినేత పదవికి అనాయాసంగా మారిపోయారు.

యువకుడూ, వివాదరహితుడూ అయిన కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రానికి సుస్థిరమైన, సమర్థమైన, జనరంజకమైన పరిపాలన అందిస్తారని ఆశిద్దాం. కానీ అధిష్ఠానం ఎజెండాను అమలు చేయడం సులభం కాదు. తెలంగాణ అంశం అత్యంత జటిలమైనది. వై ఎస్ కు కిరణ్ కుమార్ రెడ్డి సన్నిహితుడే అయినప్పటికీ ముఖ్యమంత్రిగా ఆయనకు జగన్ మద్దతు లభించే అవకాశం లేదు. తాను ముఖ్యమంత్రి అయ్యేవరకూ ఆ స్థానంలో ఎవరు ఉన్నా వారిని ప్రతిఘటించడం, తొలగించడం జగన్మోహన్ రెడ్డి రాజకీయ అవసరం. ఈ రెండు సమస్యలనూ పరిష్కరించి ముఖ్యమంత్రిగా స్థిరపడాలంటే కిరణ్ కుమార్ రెడ్డికి అధిష్ఠానం ఆశీస్సులు మాత్రమే చాలవు. అదృష్టం కూడా దండిగా అవసరం.
25-10-2010

No comments:

Post a Comment