Thursday, December 30, 2010

నాటకీయ రాజకీయాలు

ఇంకా ఎంతకాలం ఈ వీధినాటకాలు? ఎంతకాలం ప్రజల జీవితాలతో చెలగాటం? ప్రజలను వేధిస్తున్న మౌలిక సమస్యలను గాలికి వదిలి నాటకీయ రాజకీయాలతో, రాజకీయ నాటకాలతో ఇంకా ఎన్నేళ్ళు ధ్వంసరచన సాగిస్తారు? రైతుల బతుకుల్లో బడబాగ్ని చెలరేగుతుంటే పుండు మీద కారం చల్లినట్టు ఎంతకాలం బాధ్యతారహితంగా వ్యవహరిస్తారు? ప్రజాస్వామ్యాన్ని ఎన్ని రకాలుగా అపహాస్యం చేస్తారు?

తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాలలో విద్యార్థులపైన పెట్టిన కేసులు ఉపసంహరించడానికి ఇంత డ్రామా అవసరమా? కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు నిరాహారదీక్ష చేయడం విడ్డూరం కాదా? హాస్యాస్పదం కాదా? సొంత ప్రభుత్వాల నిర్ణయాలను ప్రభావితం చేయడానికి వీధిపోరాటాలు చేయవలసి వస్తే ఇక పార్టీ వేదికలెందుకు? చర్చలూ, సమాలోచనలకు అర్థం ఏముంటుంది? కింది నుంచి పైకీ, పై నుంచి కిందికీ అభిప్రాయాలనూ, నిర్ణయాలనూ తెలుసుకునే పార్టీ వ్యవస్థ ప్రయోజనం ఏమిటి?
ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో మేధావిగా పరిగణించే రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే కేశవరావు నిజం చెప్పేశారు.

‘డిసెంబరు 9న, ఆ తర్వాత డిసెంబరు 23న కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలతో విద్యార్థులను పురిగొల్పింది మేమే. వాళ్ళంతా రోడ్లపైకి వచ్చేలా చేసింది మేమే. వారిపై కేసులు నమోదు కావడానికి కారకులమూ మేమే. కాబట్టి కేసులను ఎత్తివేయించాల్సిన బాధ్యత కూడా మాదే’ అంటూ మంగళవారం మధ్యాహ్నం నిరాహార దీక్ష విరమించిన అనంతరం సెలవిచ్చారు. శభాష్. అన్నీ మేమేనని చెప్పుకోవడంలో అత్యుక్తి ఉన్నదేమో కానీ బాధ్యతను గుర్తెరగడంలో పొరపాటు లేదు. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఎప్పటికప్పుడు బలపర్చుతున్నదీ మేమే అని కూడా కేకే చెప్పినా ఓకే అనవలసి వస్తుంది. అటు కేంద్ర ప్రభుత్వంపైనా, ఇటు రాష్ట్ర ప్రభుత్వంపైనా సమయం సందర్భం వచ్చినప్పుడల్లా ఒత్తిడి తేవడానికి ఉద్యమాలు చేయడమో, చేస్తామంటూ హెచ్చరించడమో తమ కర్తవ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భావిస్తూ వచ్చారు. డిసెంబర్ 9న చిదంబరం ప్రకటన వెనుక కూడా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల పాత్ర, వారు అందించిన సమాచారం ప్రభావం ఎంతో కొంత ఉన్నదనే చెప్పుకోవాలి. ఆ తర్వాత ఘట్టంలో చెల్లియొ చెల్లకో అంటూ రాయబారం పద్యాలు చదివే వంతు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకు వచ్చింది. వారు సైతం తమ పాత్రను రసవత్తరంగా పోషించి రక్తికట్టించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ వ్యవస్థాపక దినోత్సవం జరపాలన్నా, జరపరాదన్నా, సబ్ ఇన్ స్పెక్టర్ల పరీక్ష వాయిదా వేయాలన్నా, విద్యార్థులపైన కేసులు ఎత్తివేయాలన్నా తెలంగాణ ఉద్యమకారులతో పాటు సొంత సర్కార్ పైన ఒత్తిడి తెచ్చే బాధ్యత తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలే నిర్వహిస్తున్నారు. టీఆర్ ఎస్ ఎజెండాను అమలు చేయడంలో శక్తివంచన లేకుండా చేయూత ఇస్తున్నారు.

‘మా ఎంపీలు నిరాహార దీక్ష ప్రారంభిస్తే మంచిదే కదా అనుకున్నాం. నాలుగు రోజులు దీక్ష కొనసాగిస్తే ఉద్యమం కాంగ్రెస్ చేతుల్లోకి వస్తుందని ఆశించాం. చివరికి మా వాళ్ళు కేసీఆర్ ని మరోసారి హీరోని చేశారు’ అంటూ పేరు బటయపెట్టడం ఇష్టం లేని ఒక కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యానించాడు. అరకొర దీక్షలతో ఉద్యమం చేతిలోకి వస్తుందా? కొన్ని మాసాల కిందట అమరవీరుల సంస్మరణ అంటూ రెండు జిల్లాలలో జాతర జరిపి అర్ధంతరంగా ముగించిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు నిలకడగా ఉద్యమం చేసే కుదురు కానీ ఓపిక కానీ ఉన్నాయా? అయినా టీవీ న్యూస్ చానళ్ళు డజనుకు పైగా ఉండగా, ప్రకటనలతో భూకంపం సృష్టించే అవకాశం ఉండగా పర్యటనలూ, దీక్షలూ ఎందుకు దండగ!

మంగళవారం నాటి నాటకీయ పరిణామాలనే పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ ఆత్మవంచనకూ, పరవంచనకూ ఎంతగా పాల్పడుతున్నదో, సెల్ఫ్ గోల్ ఎట్లా కొట్టుకుంటున్నదో ఇట్టే అర్థం అవుతుంది. ఒక వైపు ఎంపీలు నిరాహరదీక్ష రెండో రోజున కొనసాగిస్తుంటే మరో వైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గాంధీభవన్ లో సేవాదళ్ వేడుకలలో కాలక్షేపం చేశారు. మంత్రుల బృందం సచివాలయానికీ, దీక్షా శిబిరానికీ మధ్య తిరుగుతున్నారు. రైతులకు నష్ట పరిహారం పెంచాలంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాడు అదే చోట నిరాహారదీక్ష చేసినా మంత్రులు ఆయనను చూడటానికి అయిదు రోజుల దాకా వెళ్ళలేదు. కాంగ్రెస్ ఎంపీల చేత దీక్ష విరమింపజేయడానికి కొందరు మంత్రులు కాలికి బలపం కట్టుకొని తిరిగారు. దీక్షాశిబిరం దగ్గరికి కేసీఆర్, కోదండరామ్ లు వస్తున్నట్టు ఉదయం పదిగంటలకే తెలుసు. కేసీ ఆర్ వచ్చి ఘాటైన ఉపన్యాసం దంచి, కాంగ్రెస్ ఎంపీలను అభినందించి, శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోకపోతే పార్లమెంటు సభ్యత్వాలకు రాజీనామా చేయాలంటూ హెచ్చరించి వెళ్ళిపోయిన తర్వాత కానీ మంత్రులు జానారెడ్డి, సబితా రెడ్డి శుభవార్త మోసుకొని రాలేదు. కేసీఆర్ ప్రసంగిస్తుంటే కాంగ్రెస్ ఎంపీలందరూ బుద్ధిమంతుల్లాగా చేతులు కట్టుకొని నిలబడ్డారు. కేసుల ఎత్తివేత నిర్ణయాన్ని ప్రకటించవలసింది హోంమంత్రి హోదాలో సబితా ఇంద్రారెడ్డి. మరి జానారెడ్డి పాత్ర ఏమిటి? ఆయన ఎందుకు వచ్చారు? తెలంగాణకి చెందిన సీనియర్ మంత్రిగానా? ముఖ్యమంత్రి ప్రతినిధిగానా? విద్యార్థులపై కేసులు ఎత్తివేయించడంలో తన పాత్ర కూడా ఉన్నదని చాటుకోవడానికి కేసీఆర్ తో పాటు జానారెడ్డికి కూడా ఎంపీలు అవకాశం ఇచ్చారు.

అంతటితో నిరాహారదీక్ష అంకం ముగిసింది. మరో అంకానికి తెరలేవనుంది. డిసెంబరు తొమ్మిదో తేదీన దేశీయాంగ మంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటు గురించి ప్రకటన చేయడానికి ముందూ, ఆ తర్వాతా పోటీ రాజకీయాలతో, రాజీనామాస్త్రాలతో, రాజీనామా బెదిరింపులతో, వీధిప్రదర్శనలతో, పోలీసు బలగాల మోహరింపులతో, నిరాహార దీక్షలతో, గుండెలదిరే ప్రసంగాలతో, పరీక్షల వాయిదాలతో, బంద్ లతో, బహిరంగసభలతో, ఎడతెగని ఉత్కంఠతో, అంతులేని ఉద్రిక్తతతో, వందలాది విద్యార్థుల, యువతీయువకుల ఆత్మహత్యలతో రాష్ట్ర ప్రజల జీవితాలు అస్తవ్యస్తమైనాయి. కొన్ని గంటలలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించనున్న ఈ దశలోనైనా అశాంతి రగలకుండా నిరోధించే ప్రయత్నం జరుగుతోందా? ప్రతిపక్షానికి చెందిన నాయకులు ఉద్యమం చేసినా, స్వపక్షానికి చెందిన నాయకులు వీధులలో ప్రదర్శనలు నిర్వహించినా నిమ్మకు నీరెక్కినట్టు కాంగ్రెస్ అధినాయకత్వం ఉపేక్షించడం వ్యూహం అనిపించుకుంటుందా? ఎత్తుగడ అవుతుందా? అసమర్థత అవుతుందా?
ఇంతకాలం ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రమే అసమర్థుడనే ప్రచారం జరిగింది. మానవేతిహాసంలో కనీవినీ అవినీతిని అనుమతించిన అపకీర్తిని కూడా ఆయన ఇటీవల మూటకట్టుకున్నాడు. అది సరే. మరి సోనియాంధీ సంగతి ఏమిటి? కాంగ్రెస్ వాదులు దేవతగా కొలిచే సోనియా ఏమి చేస్తున్నారు? భావి ప్రధానిగా మొన్న ఏఐసీసీ సమావేశంలో చిదంబరం, దిగ్విజయ్ సింగ్ వంటి మేధావులు కీర్తించిన రాహుల్ గాంధీ ఏమి చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి మిగిలిన ఒకే ఒక కంచుకోట ధ్వంసమైపోతుంటే అమ్మాకొడుకూ చేస్తున్న నిర్వాకం ఏమిటి? అమ్మ మౌనం వ్యూహాత్మకమా? అశక్తతకూ, ఊగిసలాటకూ నిదర్శనమా? చిదంబరం చిద్విలాసం ఆంతర్యం ఏమిటి? కిరణ్ కుమార్ రెడ్డి మనోగతం ఏమిటి? గవర్నర్ నరసింహన్ పాత్ర ఏమిటి? శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పిస్తున్న తరుణంలో ఈ ఆరుగురూ కీలకమైన భూమికను పోషించవలసి ఉంటుంది. నివేదిక సమర్పించిన తర్వాత తీసుకోవలసిన నిర్ణయాల గురించీ, నిర్ణయాలు అమలు చేయడానికి తీసుకోవలసిన చర్యల గురించి ఇప్పటికే ఆలోచించి ఉండాలి. లేకపోతే తక్షణం ఆ పని చేయాలి. ఏమి ఆలోచించి నిర్ణయించారో కానీ భారీగా భద్రతాదళాలను రాష్ట్రంలోకి రప్పించడం ప్రజలలో అభద్రతాభావాన్ని పెంచింది. అధిష్ఠానం అసమర్థత కారణంగా రాష్ట్ర ప్రజల జీవితాలను మరోసారి సంక్షోభానికి గురి చేయడం క్షమించరాని నేరం అవుతుంది. ఇంతవరకూ సాగిన అశాంతికీ, అనిశ్చితికీ, అరాచకానికీ బాధ్యత చాలావరకూ కేంద్ర ప్రభుత్వానిదే. జరగబోయే మంచిచెడులకు సైతం కేంద్రమే బాధ్యత వహించాలి. ఇతర పార్టీలను కానీ నాయకులను కానీ నిందించడం వల్ల ప్రయోజనం లేదు. సోనియాగాంధీ స్వయంగా చొరవ తీసుకొని నిర్ణయాత్మకంగా వ్యవహరించవలసిన సందర్భం ఇది. ఇంకా నాన్చకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకొని అందరి సహకారంతో అమలు జరిపి అశాంతికి అస్కారం లేని వాతావరణం కల్పించవలసిన సమయమిది. ఇప్పటికీ మౌనంగా ఉంటే లేదా డోలాయమాన స్థితి కొనసాగిస్తే, కమిటీలతో తాత్సారం చేయాలని ప్రయత్నిస్తే ప్రజలకు తీరని ద్రోహం చేసినట్టు అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి సైతం ఎనలేని అపకారం చేసినట్టు అవుతుంది. చెట్టు ఎక్కి మొదలు నరుక్కున్న చందం అవుతుంది..
- కె.రామచంద్రమూర్తి హంసధ్వని (29-12-2010)

No comments:

Post a Comment