Saturday, December 25, 2010

అవినీతి నీడలో ప్రధాని

రాజు వ్యక్తిగతంగా నీతిమంతుడైనంత మాత్రాన సరిపోదు. రాజ్యం నీతిమంతంగా నడవాలి. నీతిమంతంగా నడుస్తున్న ప్రజలకు కనిపించాలి. నమ్మకం కలిగించాలి. ప్రధాని మన్మోహన్ సింగ్ అవినీతిపరుడు కాకపోవచ్చు. నిజాయితీపరుడే కావచ్చు. కానీ అవినీతిపరులకు కొమ్ముకాయడం కూడా అవినీతే. టెలికాం శాఖ మంత్రిగా రాజా ప్రజల సొమ్మును స్వయంగా దోచుకుంటూ, తన మనుషులకు దోచిపెడుతుంటే ప్రధానిగా మన్మోహన్ సింగ్ మౌనంగా ప్రేక్షక పాత్ర వహించడం క్షమించరాని నేరం. రాజా ఒక మంత్రి. మంత్రి తప్పు చేస్తే మందలించవలసిన బాధ్యత ప్రధాన మంత్రిదే. ఏ మంత్రి ఏ పని చేసినా అది మంత్రిమండలి యావత్తూ చేసినట్టే లెక్క. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, సమష్టి బాధ్యత అంటే అదే. రాష్ట్రపతి తరఫున పని చేస్తున్న మంత్రులు మంచి చేసినా, చెడు చేసినా అది రాష్ట్రపతికి సైతం వర్తిస్తుంది. అటువంటప్పుడు ప్రధానమంత్రికి ప్రమేయం లేదని వాదించడం అర్థరహితం. అసమంజసం. మొత్తం మంత్రివర్గం పనితీరుకూ, సాఫల్యవైఫల్యాలకూ ప్రధానమంత్రి బాధ్యత వహించవలసి ఉంటుంది.
రాజా అక్రమాలు చేస్తున్నట్టూ, అవినీతికి ఒడిగడుతున్నట్టూ స్పష్టంగా తెలిసినా నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం ప్రధానికి తగని పని. కారణాలు ఏమైనా కావచ్చు. ‍యూపీఏ కూటమిలో భాగస్వామ్య పక్షమైన డీఎంకె మద్దతు ఉపసంహరించుకుంటే మన్మోహన్ ప్రభుత్వం కూలుతుందనడంలో సందేహం లేదు. అంతమాత్రాన డీఎంకేకి చెందిన రాజా కేంద్ర ప్రభుత్వానికి సుమారు లక్షా డెబ్బయ్ ఆరు వేల కోట్ల రూపాయల నష్టం కలిగించే విధంగా కారు చౌకగా లైసెన్సులు అక్రమంగా మంజూరు చేస్తుంటే ప్రధాని మౌనంగా ఉండటం ఏ మాత్రం సమర్థనీయం కాదు.
రాజామీద క్రిమినల్ కేసు పెట్టడానికి అనుమతించవలసిందిగా కోరుతూ కేంద్ర న్యాయశాఖ మాజీమంత్రి, జనతా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి రాసిన లేఖకు పద్దెనిమిది నెలల పాటు జవాబు ఇవ్వకుండా దాటవేసిన ప్రధాని వైఖరిని ఏ విధంగా సమర్థించగలం? స్పెక్ట్రమ్ వ్యవహారంపైన దర్యాప్తు జరిపించాలని కోరుతూ సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి ప్రధానికి రెండు వేల ఎనిమిది నవంబరులోనే లేఖ రాశారు. సమాధానం లేదు. భారతీయ జనతా పార్టీ అధినాయకుడు ఎల్ కే అద్వానీ సైతం పదకొండు మాసాల కిందట ప్రధానమంత్రికి ఈ వ్యవహరంపైన ఉత్తరం రాశారు. ప్రత్యుత్తరం లేదు. సుబ్రహ్మణ్య స్వామి లేఖకు ప్రధాని అపరిమితమైన ఆలస్యంగా జవాబు ఇవ్వడంపైనే కాకుండా జవాబులో రాసిన అస్పష్టమైన భాషపైన కూడా సుప్రీంకోర్టు తప్పు పట్టడం అసాధారణమైన పరిణామం. ప్రధాని తరఫున అఫిడవిట్ దాఖలు చేయాలంటూ గురువారంనాడు దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించడం కూడా ఒక కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంలో మునుపెన్నడూ సంభవించని పరిణామమే. రాజా హయాంలో జారీ అయిన అరవై తొమ్మిది లైసెన్సులను రద్దు చేయాలంటూ టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేయడం సైతం విశేషం. పైగా తాను చేసిన పనులన్నిటినీ ప్రధానమంత్రికి చెప్పే చేశానంటూ రాజా చేసిన ప్రకటన ప్రధానికీ, యూపీఏ సర్కారుకీ, కాంగ్రెస్ పార్టీకీ పిడుగులాంటిది. ఇంత జరిగిన తర్వాత ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్ కొనసాగడం నైతికం కాజాలదు.
నిజమే. అవినీతిపరులుగా పేరుమోసిన డీఎంకే నాయకులు రాజానూ, బాలూనూ మంత్రిమండలిలోకి తీసుకోనంటూ రెండో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుకు ముందే మన్మోహన్ సింగ్ ఒక రోజంతా భీష్మించుకొని కూర్చున్న మాట నిజమే. ఏ విధంగానైనా అధికారంలో కొనసాగాలన్న సంకల్పంతో, రెండో యూపీ ఏ మంత్రిమండలిని నిర్మించాలన్న ఆరాటంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మన్మోహన్ మెడలు వంచి రాజాను మంత్రిమండలిలోకి తీసుకునేందుకు ఒప్పించిన మాటా నిజమే. సంకీర్ణ రాజకీయాల పరిమితుల కారణంగానే ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎన్ని ఆధారాలు లభించినా, చివరికి తన సలహాను తోసి రాజన్నా రాజాపైన వేటు వేయకుండా మన్మోహన్ ఉపేక్షించవలసి వచ్చిన మాటా నిజమే. రాజాను డీఎంకే అధినేత సంపూర్ణంగా బలపరిచిన మాటా, రాజాకు ఉద్వాసన చెబితే యూపీఏ సర్కార్ కు మద్దతు ఉపసంహరించుకుంటామంటూ బెదిరించిన మాటా నిజమే. కానీ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు లక్షన్నర కోట్ల కుంభకోణం జరుగుతుంటే ఉపేక్షించడం నేరం. ఏఐడీఎంకే అధినేత్రి జయలలిత అభివర్ణించినట్టు నిజంగానే ఇది మానవాళి చరిత్రలోనే అతిపెద్ద అవినీతి కుంభకోణం.
సత్యాన్నీ, అసత్యాన్నీ వేరు చేయవలసిన అవసరం ఉన్నదనంటూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయాన్ని నెలకొల్పి నూటా యాభయ్ సంవత్సరాలు గడిచిన సందర్భంగా బుధవారం జరిగిన సదస్సులో మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య నేపథ్యం కీలకమైనది. టెలికాం మంత్రిత్వ శాఖను తప్పు పడుతూ కాగ్ నివేదిక సమర్పించిన సమయంలో ప్రధాని ఇటువంటి వ్యాఖ్య చేయడం శోచనీయం. నిజంగానే అవాస్తవాలు వాస్తవాలుగా ప్రచారం పొందుతున్నాయని ప్రధాని భావిస్తూ ఉంటే నిజం నిగ్గు తేల్చడానికి అవసరమైన చర్యలను ప్రతిపక్షం అడగక ముందే స్వయంగా ప్రకటించవలసింది. పార్లమెంటు సమావేశాలు జరగకుండా ప్రతిపక్షం అడ్డు తగులుతున్నా, సుప్రీంకోర్టు సునిశితమైన విమర్శలు చేస్తున్నా, కాగ్ నివేదిక టెలికాం మంత్రిత్వ శాఖను అనేక అంశాలపైన తప్పు పడుతున్నా, అరవై తొమ్మిది లైసెన్సులు రద్దు చేయాలంటూ ట్రాయ్ సిఫార్సు చేసినా మన్మోహన్ సింగ్ మౌనం వీడకపోవడం అన్యాయం. పార్లమెంటులో ప్రకటన చేయకపోవడం అప్రజాస్వామికం.
నిజంగా కుంభకోణం జరిగిందో లేదో, నిజంగానే లక్షన్నర కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వానికి వాటిల్లిందో లేదో ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. కానీ పత్రికలలో, వార్తా చానళ్ళలో వెల్లడైన వివరాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. కాగ్ నివేదిక ఆందోళన కలిగిస్తున్నది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు దిగులు పుట్టిస్తున్నాయి. కుంభకోణం జరిగిందనీ, విపరీతమైన నష్టం ప్రభుత్వ ఖజానాకు వాటిల్లిందనీ ప్రజలు విశ్వసిస్తున్నారు. నిజానిజాలు వెలికి తీయడానికి పార్లమెంటు సభ్యలతో సంయుక్త సంఘాన్ని నియమించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతకంటే ముందు పార్లమెంటులో ప్రధాని ప్రకటన చేయాలని కోరుతున్నాయి. అయినా ప్రధాని పెదవి విప్పడం లేదు.
అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకునే క్రమంలో మొండిపట్టు పట్టి వామపక్షాల మద్దతు కోల్పోవడానికీ, ప్రభుత్వం పతనం కావడానికి సైతం సిద్ధపడిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పడిపోతుందన్న భయంతో అడ్డదారులు తొక్కడం ప్రజలకు ఎటువంటి సందేశాన్ని పంపిస్తున్నది? తన నాయకత్వంలోని ప్రభుత్వంలో ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే మౌనం వహించడాన్ని చరిత్ర క్షమించదు. మన్మోహన్ సింగ్ రాజీనామా చేసినంత మాత్రాన యూపీఏ ప్రభుత్వం కూలిపోదు. ప్రణబ్ ముఖర్జీనో, రాహుల్ గాంధీనో, మరొకరో ఆ బాధ్యత స్వీకరిస్తారు. మన్మోహన్ రాజీనామా చేయకుండా ప్రధానమంత్రిగా కొనసాగితే ఆయన నైతిక స్థాయి దిగజారుతుంది. ప్రజల గౌరవం తగ్గుతుంది. ప్రజాస్వామ్యంపైనా, నైతిక ప్రమాణాలపైనా ప్రజల విశ్వాసం దెబ్బతింటుంది. దేశ రాజకీయాలలో నైతికతకు ఒక సరికొత్త ప్రమాణాన్ని నెలకొల్పే అవకాశాన్ని మన్మోహన్ సింగ్ కోల్పోతారు. లాల్ బహద్దూర్ శాస్త్రి తర్వాత అంతటి నైతికత కలిగిన నాయకుడుగా చరిత్రలో నిలిచే అవకాశం చేయి జారుతుంది. మన్మోహన్ దేశానికి ఎంతో సేవ చేశారు. దేశ ఆర్థికాభివృద్ధికి ఎనలేని దోహదం చేశారు. ఏడు సంవత్సరాలు ప్రధానమంత్రిగా దేశాన్ని ప్రగతి మార్గంలో సమర్థంగా నడిపించారు. ఇది చరిత్రలో తన స్థానం గురించి ఆలోచించవలసిన సమయం. అవినీతిని ఉపేక్షించిన ప్రధానిగా, కనీవినీ ఎరుగుని అవినీతికి ఆలవాలమైన ప్రభుత్వానికి నాయకత్వం వహించిన వ్యక్తిగా చరిత్ర బుట్టదాఖలు చేయకుండా జాగ్రత్తపడవలసిన సందర్భం. కుంభకోణం జరగలేదని నిరూపించడమో, రాజీనామా చేయడమో. రెండే మార్గాలు. మూడో మార్గం లేదు. అవినీతి జరగలేదని నిర్ద్వంద్వంగా నిరూపించగలిగితే మన్మోహన్ దర్జాగా ప్రధాని పదవిలో రాహుల్ పెళ్ళి చేసుకొని పదవీ బాధ్యతలు తలకెత్తుకోవడానికి సిద్ధమయ్యే వరకూ కొనసాగవచ్చు. ఆ పని చేయలేకపోతే పదవి నుంచి తప్పుకోవడం ఒక్కటే మార్గం. నిర్ణయం తీసుకోవలసింది ఆయనే. సోనియాగాంధీ కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా కాదు.
(20-11-2010)

No comments:

Post a Comment