రాష్ట్రంలో మృత్యుఘంటికలు నిరవధికంగా మోగుతున్నాయి. ప్రకృతి శాపానికీ, ప్రభుత్వ నిర్లక్ష్యానికీ గురైన రైతులు పిట్టల్లాగా రాలిపోతున్నారు. రాజకీయం భ్రష్టుపట్టిపోతోంది. మానవీయ దృష్టి, విశాల దృక్పథం, స్పందించే గుణం లోపించిన రాజకీయ నాయకత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది.
రెండు వారాలలో వందమందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వారం రోజులుగా నిరాహారదీక్ష కొనసాగిస్తున్నపటికీ పాలకులలో పెద్దగా చలనం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల వైదొలిగిన యువనేత వైఎస్ జగన్మోహనరెడ్డి విజయవాడలో రెండు రోజుల నిరశన లక్ష్యదీక్ష చేపట్టారు. అధికార పక్షం చేష్టలుడిగి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నది. నిరశన దీక్షల వల్ల ఎవరికి ఎంత రాజకీయ లబ్ధి కలుగుతుందోనని ఆలోచించడమే కానీ రైతుల ఆత్మహత్యలు నిరోధించే ప్రయత్నం జరగడం లేదు. ఈ పని తక్షణం జరగాలి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం కంటే సమాజం ఇచ్చే విశ్వాసం, చేయూత ముఖ్యం. రాజకీయ వ్యవస్థలో భయంకరమైన, అమానవీయమైన, విచ్ఛిన్నకరమైన ధోరణులు ప్రబలిన కారణంగా ఆత్మహత్యలను సైతం రాజకీయ దృష్టికోణం నుంచే చూస్తున్నాం. రాజకీయ నాయకులు పంతాలూపట్టింపులకు పోతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సమగ్రమైన వ్యవసాయ విధానం అంటూ లేదు. వ్యవసాయరంగంలో కొనసాగుతున్న సంక్షోభంపైన శాసనసభలో కానీ పార్లమెంటులో కానీ చర్చ జరగలేదు. ప్రభుత్వాలను అప్రతిష్ఠపాలు చేయాలని ప్రతిపక్షాలు వ్యూహం రచిస్తుంటే ప్రతిపక్షాల లక్ష్యం నెరవేకుండా నిరోధించడానికి అధికార పక్షం ప్రతివ్యూహం రచిస్తోంది. రెండు పక్షాల మధ్యా ప్రజలు నలిగిపోతున్నారు.
రాష్ట్రంలో రైతులూ, కౌలురైతులూ చస్తుంటే, ప్రతిపక్షం ఆందోళన చేస్తుంటే ముఖ్యమంత్రి కరుణాకరరెడ్డి ఏఐఐసీసీ సమావేశాల పేరుతో మూడు రోజులపాటు ఢిల్లీలో మకాం వేయడం విచారకరం. హైదరాబాద్ తిరిగి వచ్చిన వెంటనే నిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి చంద్రబాబునాయుడిని పరామర్శించి నిరాహారదీక్ష విరమించవలసిందిగా ముఖ్యమంత్రి విజ్నప్తి చేయవలసింది. కేంద్రమంత్రి శరద్ పవార్ రాష్ట్రానికి వచ్చి రైతులను పరామర్శించవలసింది. ప్రధాని కనీసం ఫోన్ చేసి చంద్రబాబు నాయుడితో మాట్లాడవలసింది. రాజకీయ నేతలు పాటించవలసిన కనీస మర్యాదలు సైతం మంటగలిసిపోవడం విషాదం. ఈ దుస్థితికి కారణం ఏమిటి? ఎవరికెంత రాజకీయ ప్రయోజనం కలుగుతుందోనని నిరంతరం లెక్కలు కట్టుకోవడం. ప్రతిరోజు రాజకీయంగా ఎవరికెంత లాభమో, నష్టమో బేరీజు వేసుకోవడం. వ్యవసాయం దండగ అని చెప్పిన నాయకుడు నేడు రైతులకోసం నిరవధిక నిరశన దీక్ష కొనసాగించడం అప్పటి మచ్చ మాపుకోవడానికేనని విమర్శించవచ్చు. మచ్చ మాపుకోవడానికి ప్రయత్నంచడం తప్పు అవుతుందా? నష్టాలలో, కష్టాలలో సతమతం అవుతున్న రైతులకు సాయం అందాలని కోరుతూ ఎవరు ప్రత్యక్ష కార్యాచరణకు దిగినప్పటికీ సమర్థనీయమే. అభినందనీయమే. ప్రతిపక్షంలో పని చేసిన అనుభవం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తన వ్యవసాయ విధానం ఏమిటో చంద్రబాబునాయుడు ప్రకటించాలి. పోటీ నిరాహారదీక్షలు రాజకీయ లబ్ధికోసమేనని వాదించవచ్చు. కానీ ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ నాయకులు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికీ, సమస్యలు పరిష్కరించవలసిందిగా ఒత్తిడి తేవడానికీ, ప్రజల తరఫున పోరాడుతున్నామని చాటుకోవడానికీ ఆందోళన చేయడం సహజం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా నిరాహారదీక్ష చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడూ లేదా మధ్యంతర ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం బలపడినప్పుడు ప్రజలను మెప్పించేందుకు ప్రతిపక్షం మరింతగా చెలరేగి పోవడం, వీరంగం వేయడం ఆనవాయితీ. ప్రతిపక్షాలు ఏమి చేసినా, ఏమి చేయకపోయినా పాలకపక్షం చేయవలసిన కనీస విధులు కొన్ని ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు ప్రకటించాలి. సహాయం సత్వరం అందించి రైతులను ఆదుకోవడానికి మంత్రులూ, ప్రభుత్వాధికారులూ సర్వోన్నత ప్రాధాన్యం ఇవ్వాలి. పాలకపక్షానికి చెందిన ఇతర నాయకులు రైతులను కలుసుకొని వారికి బతుకుపైన నమ్మకం కలిగించే ప్రయత్నం చేయాలి. వడ్డీ వ్యాపారుల బారి నుంచి వారిని రక్షించే మార్గం కనిపెట్టాలి. నిజానికి ఇది అధికార పక్షానికి చెందిన నాయకులకో లేదా అన్ని పక్షాలకూ చెందిన రాజకీయ నాయకులకో సంబంధించిన బాధ్యత మాత్రమే కాదు. యావత్ సమాజం నిర్వర్తించవలసిన నైతిక విధి. సంక్షోభంలో ఉన్న అన్నదాతకు ఆపన్నహస్తం అందించడం సమాజంలోని అందరి కర్తవ్యం.
కొన్ని మాసాలుగా ప్రకృతి వికృతంగా వ్యవహరించిన కారణంగా రాష్ట్రంలో సుమారు ఇరవై లక్షల ఎకరాలలో వరిపంట నీటిపాలయింది. పది లక్షల ఎకరాలలో పత్తి నాశనమైపోయింది. లక్షలాది సన్నకారు రైతులతో పాటు నలభై లక్షల మంది కౌలు రైతులు జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు అందించే అరకొర సహాయం కూడా భూమి యజమానులకు చేరుతోంది కానీ కౌలు రైతుకు అందడం లేదు. కౌలు రైతులకు బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు. వడ్డీ వ్యాపారుల నుంచి భారీ వడ్డీకి అప్పులు చేసిన కౌలు రైతులు వరుసగా సంభవించిన ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్రంగా నష్టపోయారు. ప్రకృతి వైపరీత్యాలు లేని కాలంలో సైతం వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. రైతులు నష్టపోతున్నారు. రైతులతో పాటు అతివృష్టి కారణంగా జాలర్లు జీవనోపాధి కోల్పోయారు. నేతపనివారికీ, ఇతర చేతివృత్తులవారికీ పని లేకుండా పోయింది. పల్లె ప్రాంతాలలో అన్ని వర్గాలవారూ తీవ్రంగా నష్టపోయారు. అప్పుల ఊబి నుంచి బయటపడే మార్గం కానరాక, వడ్డీవ్యపారుల చేతుల్లో అవమానాలు భరించలేక బాధితులు ఆత్మహత్యను ఆశ్రయిస్తున్నారు.
ఇటువంటి సమయంలో దెబ్బతిన్న రైతులనూ, కౌలురైతులనూ, చేతివృత్తులవారినీ ఆదుకోవడానికి గట్టి ప్రయత్నం నిజాయితీగా యుద్ధప్రాతిపదికమీద జరగాలి. ఆ పని చేయకుండా ఏఐసీసీ సమావేశాలు ముగిసిన తర్వాత అధిష్ఠాన దేవత దర్శనం కోసం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో టెన్ జన్ పథ్ దగ్గర పడిగాపులు పడుతున్న దృశ్యాలను చూస్తే అవమానంతో హృదయం దహించకమానదు. కాంగ్రెస్ నాయకులందరూ కేంద్ర నాయకులను కలిసి రాష్ట్ర రైతులకు సహాయం పెంచవలసిందిగా కోరడం అవసరమా? అందుకోసం ఢిల్లీలో బస చేయాలా? ఈ జుగుప్సాకరమైన తతంగం ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్రతిసారీ పునరావృత్తం కావలసిందేనా? ఈ దుర్భర దృశ్యాలు పుండుమీద కారం చల్లినట్టు ఉంటాయన్న ఇంగితం సైతం నాయకులకు ఎందుకు ఉండదో అర్థం కాదు. కౌలు రైతులు ఆత్మవిశ్వాసం లేకా, సహాయం అందకా ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేంద్ర, రాష్ట్ర స్థాయిలలోని కాంగ్రెస్ నాయకత్వం వివేకం లేకా, నిజాయితీ లేకా రాజకీయ ఆత్మహత్య చేసుకుంటోంది.
పదేళ్ళకు పైగా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ఆత్మహత్యలు నిరోధించేందుకు జయతీఘోష్ కమిటీ, స్వామినాథన్ కమిటీ, కోనేరు రంగారావు కమిటీలు చేసిన సిఫార్సులు కంటి తుడుపుగా కూడా అమలు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకంటే అధ్యానంగా, సన్నకారు రైతులకూ, కౌలురైతులకూ ప్రతికూలంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ప్రభుత్వం తక్షణం తీసుకోవలసిన చర్యలు కొన్ని ఉన్నాయి. ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టు రైతులకు పంట నష్టపరిహారం గణనీయంగా పెంచాలి. నాణ్యతతో నిమిత్తం లేకుండా దెబ్బతిన్న ధాన్యం పూర్తి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలి. ప్రైవేటు రుణాలపైన మారటోరియం ప్రకటించాలి. సాగుకోసం వినియోగించే ఎరువులపైనా, రసాయనాలపైనా, వంగడాలపైనా ఇస్తున్న సబ్సిడీని పెంచి జూలై-నవంబర్ మధ్య కాలంలో వేసిన పంటలకు కూడా వర్తింపజేయాలి. కౌలు రైతులకు పావలా వడ్డీ రుణాలు అందించాలి. వారికి గుర్తింపు కార్డు ఇచ్చి అస్తిత్తం కల్పించాలి. రబీకి ఎరువులూ, విత్తనాలూ ఉచితంగా సరఫరా చేయాలి. రైతులను ఆదుకోవడంకోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెరవనక్కరలేదు.
రైతులకోసం చేసే వ్యయం స్పెక్ట్రమ్ కుంభకోణంలో అధికార ప్రముఖులు కాజేసిన సొమ్ములో ఎన్నో వంతు అవుతుంది? కామన్వెల్స్ క్రీడల పేరుతో నేతలు మేసిన నిధులతో పోల్చితే ఏమాత్రం ఉంటుంది? ప్రభుత్వాలు చేస్తున్న దుబారాతో పోల్చితే ఈ ఖర్చు ఏపాటిది? ప్రతిపక్ష నాయకులకు ఎంత రాజకీయ లబ్ధి ఉంటుందనే ఆలోచనకు స్వస్తి చెప్పి, భేషజాలను పక్కన పెట్టి, రాగద్వేషాలను విస్మరించి చంద్రబాబునాయుడు చేత నిరాహారదీక్ష విరమింపజేయడానికి ముఖ్యమంత్రి తక్షణం పూనుకోవాలి. ఆత్మహత్యలకు ఒడిగట్టకుండా రైతులను నిరోధించడానికి అవసరమైన సకల చర్యలూ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం వెంటనే రంగంలో దిగి రాష్ట్ర ప్రభుత్వానికి బాసటగా నిలవాలి. ప్రధాని మంజూరు చేశారని రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు చెబుతున్న నాలుగు వందల కోట్ల నిధులు సరిపోవు. కేంద్రం ఉదారంగా సాయం చేయవలసిన సందర్భం ఇది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థిని జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. రైతులలో ఆత్మవిశ్వాసం నింపడానికీ, అన్ని విధాలా వారిని ఆదుకోవడానికీ సమాజంలో అందరూ చేతనైనంత చేయాలి. ఇది అత్యవసర పరిస్థితి. ఎత్తులకూ పైఎత్తులకూ, ఖండనమండనలకూ, పోటీ ప్రకటనలకూ, అసహ్యకరమైన రాజకీయ విన్యాసాలకూ ఇది సమయం కాదు.
(23-12-2010)
No comments:
Post a Comment