అమెరికా అధ్యక్షుడు ఒబామా రానూ వచ్చాడు. వెళ్ళనూ వెళ్ళాడు. బిల్ క్లింటన్ వచ్చినప్పటి ఆనందోత్సాహాలు లేవు. జార్జి బుష్ సందర్శన నాటి ఆత్మీయతాభావన లేదు. ప్రస్తుత భారత పాలకవర్గం ఏమి వినాలని కోరుకుంటున్నదో ఒబామాకు తెలుసు. ఆ మాటలు మాట్లాడి ఆనందపరిచాడు. తనకు అవసరమైన పని చక్కగా చేసుకున్నాడు.
భారత పాలకవర్గం ప్రస్తుతానికి కోరుకుంటున్న అంశాలు మిటి? ఒకటి, భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం. 2) కాశ్మీర్ విషయంలో అమెరికా కానీ మరే ఇతర దేశం కానీ మధ్యవర్తిత్వం అంటూ పిలవని పేరంటానికి రాకుండా దూరంగా ఉండటం. 3) అణు ఇంధనాన్ని వినియోగించిన తర్వాత తిరిగి శుద్ధి చేసేందుకు ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం. 4) అఫ్ఘానిస్తాన్ లో ముఖ్యమైన పాత్ర పోషించడం.
ఐక్యరాజ్య సమితి భద్రతామండలిని సంస్కరించిన తర్వాత అందులో శాశ్వత సభ్యత్వం పొందడం కోసం భారత పాలకులు చేయని ప్రయత్నం లేదు. మనవాళ్ళు మద్దతు అడగని విదేశీ అధినేత లేదు. చిన్నాచితకా దేశం ప్రధాని వచ్చినా, అధ్యక్షుడు కనిపించినా భద్రతామండలి సభ్యత్వంకోసం మద్దతు కోరడం అపహాస్యకరమైన ఆనవాయితీగా మారింది. శాశ్వత సభ్యత్వం వస్తే దాంతో ఏమి చేయబోతున్నాం? జవహర్ లాల్ నెహ్రూ లాగా ప్రపంచ పరిణామాలపైన స్వతంత్ర వైఖరిని ప్రకటించాలంటే భద్రతా మండలిలో సభ్వత్యం అక్కర లేదు. అఫ్ఘానిస్తాన్ లో, ఇరాక్ లో ఏమి జరిగినా మౌనం పాటించి అమెరికాను సంతోషపరచాలనుకుంటే, అదే మన విదేశాంగ విధానం అనుకుంటే భద్రతామండలిలో సభ్వత్వంతో పని లేదు.
జపాన్ కు శాశ్వత సభ్యత్వం అనివార్యమంటూ ప్రకటించిన అమెరికా ఇండియా విషయంలో షరతులతో కూడిన మద్దతు ఇవ్వడానికి మాత్రమే సిద్ధంగా ఉంది. పార్లమెంటు ప్రసంగంలో ఒబామా భారత సభ్వత్వానికి మద్దతు తెలిపారు కానీ మనస్ఫూర్తిగా కాదు. రాబోయే కాలంలో అన్నాడు కానీ కాలపరిమితి లేదు. భారత దేశం భద్రతామండలిలోని తాత్కాలిక సభ్యత్వాన్ని ఎట్లా వినియోగించుకుంటుందో పరిశీలించిన మీదత శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఇవ్వడమా లేదా అన్నది నిర్ణయించుకుంటామనే ధ్వని ఒబమా మాటల్లో ఉన్నది. ఈ మాత్రమైనా హామీ ఇవ్వడానికి కారణం ఏమిటి? భారత్ ఒక ఆర్థిక శక్తిగా ఎదుగుతూ ఉండటమే.
క్లింటన్, ఒబామాలు అమెరికా అధ్యక్షులుగా ప్రమాణం చేసిన తర్వాత, అంతకు ముందు ఎన్నికల ప్రచారాలలో కాశ్మీర్ ను ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత భయంకరమైన సమస్యగా అభివర్ణించినవారే. కానీ శ్వేతభవనంలో కొన్ని మాసాలు కాపరం చేసిన తర్వాత, సడలని భారత ప్రభుత్వ వైఖరిని తెలుసుకున్న తర్వాత తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పాకిస్తాన్ పాలకుల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా అడుగు ముందుకు వేయడానికి సంకోచమే. ఒబామా అధ్యక్ష పదవిని స్వీకరించిన కొత్తల్లో కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిగా క్లింటన్ ను నియమించాలని కూడా ఆలోచించాడు. కానీ అంతలోనే ఆ ఆలోచనను విరమించుకున్నాడు. భారత్ ను కలవరపరచడం ఆయనకు ఇష్టం లేదు. ఎందుకు? భారత్ ఒక ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది కనుక. చైనా ఆర్థిక దిగ్గజం కనుక ఆ దేశంలో మానవహక్కుల గురించి కానీ, టిబెట్ గురించి కానీ ఎవ్వరూ ప్రశ్నించరు. భారత్ కూడా ఆర్థికంగా బలపడితే కాశ్మీర్ గురించి కానీ మానవహక్కుల గురించి కానీ ఎవ్వరూ నిలదీయరు. ఇందుకు దేశ పౌరులుగా మనం సంతోషించాలా, బాధపడాలా అన్నది వేరే విషయం.
అమెరికా కంపెనీల నుంచి అణు ఇందనం, ఇతర సామగ్రి కొనుగోలు చేస్తే యురేనియం శుద్ధి చేసినా, ఎగుమతి చేసినా ఒబామా అభ్యంతరం చెప్పడు. ఒకే ఒక్క షరతు ఏమిటంటే అమెరికా కంపెనీలకు ఇబ్బంది కలిగించే పూచీకత్తు అంశాన్ని ఒప్పందాల నుంచి తొలగించాలి లేదా నీరుగార్చాలి. అమెరికా కంపెనీలు సరఫరా చేసిన యంత్రాలను వినియోగించడం వల్ల జరిగే ప్రమాదాలకు బాధ్యత ఆ కంపెనీలే వహించాలనీ, నష్టపరిహారం చెల్లించాలనీ భారత పార్లమెంటు నిర్దేశించింది. ఈ అంశాన్ని మినహాయించాలని అమెరికా కంపెనీల తరఫున ఒబామా కోరుతున్నాడు.
మొత్తం మీద అమెరికా, భారత్ ల వైఖరులలో ఒబామా పర్యటన ఫలితంగా కొత్తగా వచ్చిన మార్పంటూ ఏమీ లేదు. భారత్ కు కొత్తగా ఒరిగిందీ ఏమీ లేదు. ఆ విధంగా చూస్తే ఒబామాకే కొన్ని ప్రయోజనాలు నెరవేరాయి. భారత్ తో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా అమెరికాలో యాభైవేల ఉద్యోగాలు పుట్టించబోతున్నట్టు పదేపదే ప్రకటించి సొంతదేశంలో కోపంగా ఉన్న నిరుద్యోగులను శాంతింపజేసే అవకాశం ఆయనకు దక్కింది. ముంబయ్ తాజ్ లో బస చేసినా, ఉగ్రవాద ముష్కరులను పట్టుకొని శిక్షించాలంటూ ప్రకటన చేసినా పాకిస్తాన్ ను నిందించకుండా ఒబామా జాగ్రత్త పడ్డాడు. పర్యటన ముగించే ముందు చాలా స్వల్పంగా, మొక్కుబడిగా పాక్ ప్రస్తావన చేశాడు.
అదైనా ఎందుకు చేశాడు? భారత్ ఆర్థికంగా ఎదుగుతున్న శక్తి కనుక. భారత నాయకులు పాకిస్తాన్ ను నిందించాలని గట్టిగా కోరుతున్నారు కనుక.
నిజానికి పాకిస్తాన్ ను పల్లెత్తు మాట అనే సాహసం ఒబామా చేయలేడు. అఫ్ఘానిస్తాన్ ఊబిలో నుంచి బయట పడాలంటే అమెరికాకు పాకిస్తాన్ సహకారం అత్యవసరం. ఎన్ని వేలకోట్ల డాలర్లు అప్పనంగా ఇచ్చినా పాకిస్తాన్ నాయకులూ, సైనికాధికారులూ బిగుసుకునే ఉంటున్నారు. తాలిబాన్ కూ, ఇతర ఉగ్రవాద ముఠాలకూ మద్దతూ, ఆశ్రయం ఇస్తూనే ఉన్నారు. అమెరికా పాకిస్తాన్ కు లొంగినట్టు కనిపిస్తుంది కానీ అమెరికాకు పాకిస్తాన్ భయపడుతున్నట్టు కనిపించదు. అఫ్ఘానిస్తాన్ నుంచి సోవియెట్ యూనియన్ సైన్యాన్ని ఎట్లా సాగనంపారో అట్లాగే అమెరికా సైనికులనూ, ఇతర నాటో దేశాల సైనికులనూ పంపించివేయడానికి తాలిబాన్ తో కలసి పాక్ సైన్యం రంగం సిద్ధం చేస్తున్నది. అఫ్ఘానిస్తాన్ నుంచి మర్యాదగా ఎట్లా బయడపడాలన్నదే ఒబామా తాపత్రయం. భారత్ కు అఫ్ఘానిస్తాన్ లో సూదిమొన మోపడానికి సరిపడ పాత్రనైనా అనుమతించడానికి పాకిస్తాన్ సిద్ధంగా లేదు. అమెరికాకు మద్దతుగా అఫ్ఘానిస్తాన్ కు భారత సైనికులను పంపించి పాకిస్తాన్ సైనికులతో, తాలిబాన్ తో, హక్మతియార్ వంటి హంతకుల చేతుల్లో ఉన్న ప్రైవేటు సైనికులతో తలబడే సాహసం భారత ప్రభుత్వం చేయజాలదు. ఈ నేపథ్యంలో అఫ్ఘానిస్థాన్ లో గౌరవనీయమైన పాత్ర కావాలన్న భారత పాలకుల ఆకాంక్ష ఎట్లా నెరవేరుతుంది? అందుకు అమెరికా ఎట్లా సహకరిస్తుంది? భారత్ ఎంతటి ఆర్థిక శక్తిగా ఎదిగినా ఈ విషయంలో మాత్రం అమెరికా పాకిస్తాన్ తోనే కలిసి ఉంటుంది. ఒబామా వర్తమానం, భవిష్యత్తు పాకిస్తాన్ పాలకులతో, సైనికాధికారులతో ముడిపడి ఉన్నాయనే వాస్తవాన్ని భారత పాలకవర్గం గుర్తించాలి. అఫ్ఘానిస్తాన్ విషయంలో ఒబామా స్పష్టమైన హామీ ఏదీ ఇవ్వకపోవడానికి కారణం అదే.
ఒబామా పర్యటనలోని నీతి ఏమంటే ఏ దేశ అధినేత అయినా ఆ దేశం అవసరాలకూ, ప్రయోజనాలకూ అనుగుణంగా మాట్లాడతాడు. నడుచుకుంటాడు. మన పాలకులు సైతం ఇదే నీతిని అనుసరించాలి. అమెరికా పట్ల వ్యామోహం వదులుకోవాలి. సొంతబలం మీద ఆధారపడటం, ఆర్థిక పరిపుష్టి సాధించడం, స్వతంత్రంగా, వాస్తవిక దృష్టితో, హుందాగా వ్యవహరించడంపై దృష్టి పెట్టాలి. చైనాను చూసి నేర్చుకోవాలి.
(10-11-2010)
No comments:
Post a Comment